ఓల్డ్ ఏజ్ గోల్డ్! | Old is gold store | Sakshi
Sakshi News home page

ఓల్డ్ ఏజ్ గోల్డ్!

Published Sat, Sep 19 2015 1:37 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

ఓల్డ్ ఏజ్ గోల్డ్! - Sakshi

ఓల్డ్ ఏజ్ గోల్డ్!

♦ వృద్ధులకు ప్రత్యేకం... ఓల్డ్‌ఈజ్‌గోల్డ్‌స్టోర్
♦ టాయిలెట్ రెయిజర్ల నుంచి వీల్ చెయిర్ల వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే
♦ ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో స్టోర్లు
♦ రూ.35-40 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘అమ్మా నాకిది కావాలి’ అని అడగడం ఆలస్యం.. క్షణాల్లో అమరిపోతుంది!‘నాన్నా ఇంటికొచ్చేటప్పుడు ఫలానా వస్తువు తీసుకురా’ అని చెబితే చాలు.. రాత్రికల్లా ఆ వస్తువు ఇంట్లో ఉండి తీరుతుంది!!

 అదండీ... ఇప్పటి పిల్లల పవర్. కాకపోతే పిల్లలు అడిగిందే ఆలస్యం అన్నీ కొనిచ్చేసే తల్లిదండ్రులకు... తీరా వాళ్లు వేరొకరిపై ఆధారపడే పరిస్థితి వచ్చేసరికి అన్నీ సమస్యలే. చదువనో, కొలువనో పిల్లలు విదేశాల్లో స్థిరపడటం... ఆఫీసు పనుల్లో బిజీగా ఉండటం... కారణాలేవైనా పెద్దవాళ్లకి ఏదైనా కావాల్సొస్తే మాత్రం ఎప్పుడూ ఇబ్బందే. దీనికి తోడు ఆరోగ్య సమస్యలెదురైతే ఆ బాధ మరీను!! అందుకే బ్యాక్ సపోర్ట్‌లు, టాయిలెట్ రెయిజర్లు, పడక కుర్చీలూ, డయాబెటిక్ శాండల్స్ అంటూ వృద్ధుల జీవన శైలిని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మార్కెట్లోకి బోలెడన్ని వస్తువులొచ్చాయి.

మరి వాటిని కొనుగోలు చేయడమెలా!! ప్రతిదానికీ పిల్లలను అడగలేరూ, అలాగని వెళ్లి తెచ్చికోనూ లేరు! ఇలాంటి సమస్య నుంచే పుట్టింకొచ్చిందే ‘ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ స్టోర్’. ఎవరి సహాయం అవసరం లేకుండా, ఒక్కో దుకాణం వెతుక్కుంటూ తిరక్కుండా వృద్ధులకు అవసరమైన అన్ని వస్తువులనూ ఒక్క చోటే అందించడమే ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ స్టోర్ ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్ మాటల్లోనే...

 లాభాలతో పాటు ఇతరులకు సహాయపడేలా ఉండే చాలా వ్యాపారాలు... ఏదో ఒక సమస్య నుంచి పుట్టినవే. ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ ప్రయాణమూ అలాంటిదే. పదేళ్ల క్రితం మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంచానికే పరిమితమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాలోని సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీని వదిలేసి ఇండియాకు వచ్చేశా. అమ్మ ఆరోగ్య బాగోగులు చూస్తున్న సమయంలో ప్రతిసారీ ఎవరిపైనా ఆధారపడకుండా, ప్రతి చిన్న విషయానికి ఎవరినీ పిలవాల్సిన అవసరం లేకుండా కొన్ని పనులైనా సొంతంగా చేసుకునేలా వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండే వస్తువులను కొనాలనుకున్నా.

కానీ, అప్పుడొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఎక్కడికెళ్లినా పెద్దవాళ్లకు అవసరమయ్యే వస్తువులంటే షుగర్‌ని కొలిచే పరికరాలో, వీల్ చెయిర్ల వంటివో కనిపించేవి. కానీ, విదేశాల్లో మాదిరిగా ఆధునిక సాకేంతిక పరిజ్ఞానంతో పనిచేసే చాలా వస్తువులు ఇండియాలో దొరకట్లేదని!! మా అమ్మ లాంటి వాళ్లందరి అవసరాలు తీర్చాలంటే ఆన్‌లైనే సరైన వేదికని నిర్ణయించుకున్నా. నా భార్యతో పాటు మరో స్నేహితుడితో కలిసి సీనియర్ సిటిజన్లకు కావాల్సిన అన్ని పరికరాలను విక్రయించేందుకు 2012లో ఓల్డ్‌ఈజ్‌గోల్డ్‌స్టోర్‌ను ప్రారంభించా.

 టాయిలెట్ రెయిజర్ల నుంచి వీల్ చెయిర్ల వరకూ..
 మందులతో వెంటనే నయంకాని ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, డయాబెటిస్ లాంటి రకరకాల సమస్యల నుంచి ఉపశమనాన్నిచ్చే పరికరాలు చాలానే ఉన్నాయి. డయాబెటి క్ శాండిల్స్, యాంటీ స్లిప్పరీ మ్యాట్స్, టాయ్‌లెట్ రెయిజర్లు, భూతద్ధం అమర్చిన నెయిల్ క్లిప్లర్లూ, బ్యాక్ సపోర్ట్, పడక కుర్చీలు, సీనియర్ ఫ్రెండ్లీ సెల్‌ఫోన్లూ, షేవర్లూ, బ్యాగుల వంటి సుమారు 200కు పైగా వస్తువులు అందుబాటులో ఉన్నాయి. రూ.30 నుంచి 30 వేల వరకు ధరలుండే వస్తువులున్నాయిందులో.

 రూ.35-40 కోట్ల నిధుల సమీకరణ..
 ఓల్డ్‌ఈజ్‌గోల్డ్‌లోని చాలా వరకు ఉత్పత్తులు చైనా, తైవాన్, మలేషియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. మొత్తం ఉత్పత్తుల్లో 90 శాతం దిగుమతివే. ఎక్కువ డిమాండున్న వస్తువులను దిగుమతి చేసుకుంటే ధర ఎక్కువవుతుంది. అందుకే వాటిని మేమే సొంతగా తయారు చేయడం మొదలుపెట్టాం. దీంతో ధర కూడా తగ్గుతుంది. కొత్త ఉత్పత్తుల తయారీ, స్టోర్ల విస్తరణ నిమిత్తం రూ.35-40 కోట్ల నిధులను సమీకరిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి డీల్‌ను క్లోజ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
 
 బెంగళూరు, హైదరాబాద్‌లోనూ స్టోర్లు..
 ప్రస్తుతం ఓల్డ్‌ఈజ్‌గోల్డ్‌కు చెన్నైలోని అన్నానగర్, అడయార్‌లో రెండు స్టోర్లున్నాయి. రెండేళ్లలో దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలిదశగా ఈ ఏడాది చివరి నాటికి బెంగళూరు, హైదరాబాద్‌లో స్టోర్లను ప్రారంభించనున్నాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఆఫీసు స్థలం ఎంపిక, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని పూర్తి చేశాం. తమిళనాడులో అయితే ఆర్డరిచ్చిన రోజే డెలివరీ చేస్తాం. ఇతర నగరాలకైతే 2-3 రోజుల పడుతుంది.
 
 పట్టణ కస్టమర్లే ఎక్కువ..
 ఓల్డ్‌ఈజ్‌గోల్డ్ కస్టమర్లలో పట్టణ ప్రాంతాలు, ఎన్నారైల వాటా ఎక్కువ. మొత్తం మార్కెట్లో బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్డర్ల వాటా 15 శాతం వరకుంటుంది. తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని విదేశాల నుంచి రకరకాల పరికరాలను ఆర్డరిచ్చే వాళ్లు కొందరైతే.. వాళ్ల పుట్టిన రోజు, ఇతర వేడుకల సమయంలో బహుమతులుగా కొన్ని పరికరాలు అందించే వాళ్లు ఇంకొందరు. తల్లిదండ్రులకు డబ్బులిచ్చి ప్రేమను చూపించలేకపోవచ్చు. కానీ, ప్రేమగా వాళ్లకు ఉపయోగపడే వస్తువులను కొనిచ్చి మీ బాధ్యత నాది అన్న భరోసానైతే ఇవ్వగలం కదా!. అందుకే మా మార్జిన్ల గురించి కాకుండా వాళ్లకు ఆ వస్తువులు ఎంతలా ఉపయోగపడతాయన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement