మేక్ మైట్రిప్ చేతికి ‘ఐబిబో’..
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ పర్యాటక సేవల సంస్థ మేక్‌మైట్రిప్ తన ప్రత్యర్థి సంస్థ ఐబిబోను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ రూపంలో ఈ డీల్ జరగనుంది. దీంతో ఈ విభాగంలో మేక్‌మై ట్రిప్ ప్రధాన సంస్థగా అవతరించనుంది. ఐబిబోను దాని వాటాదారులైన దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్, చైనాకు చెందిన టాన్సెంట్ హోల్డింగ్స్ మేక్ మైట్రిప్‌కు విక్రయించేందుకు ముందుకు రాగా, దీనికి ప్రతిగా మేక్ మై ట్రిప్ ఆయా సంస్థలకు తాజా వాటాలను జారీ చేయనుంది. ఈ మేరకు మేక్ మై ట్రిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. డీల్ పూర్తయితే ఐబిబో పూర్తిగా మేక్ మైట్రిప్ పరం అవుతుంది.
అదే సమయంలో నాస్పర్స్, టాన్సెంట్ హోల్డింగ్స్ కలసి మేక్ మై ట్రిప్‌లో 40 శాతం వాటాను కలిగి ఉంటారు. ఇందుకు అనుగుణంగా మూలధన నిధులను సైతం అందించనున్నట్టు మేక్ మైట్రిప్ సంస్థ తెలిపింది. మేక్ మైట్రిప్ గతంలో సీట్రిప్ డాట్ కామ్‌కు జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్‌ను సాధారణ ఈక్విటీ కిందకు మార్చనున్నట్టు దీంతో ఈ సంస్థకు 10 శాతం వాటా ఉంటుందని వెల్లడించింది.
మేక్‌మైట్రిప్ వాటాదారులతోపాటు నియంత్రణ సంస్థల అనుమతి అనంతరం ఈ డీల్ డిసెంబర్‌లోపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. మేక్ మై ట్రిప్ నాస్‌డాక్ లిస్టెడ్ కంపెనీ. కాగా, తాజా డీల్ నేపథ్యంలో కంపెనీ షేరు ధర మంగళశారం ఇంట్రాడేలో దాదాపు 50% ఎగసి 31 డాలర్లను తాకడం గమనార్హం.