ప్లానింగ్ తోనే బంగారు భవిత
విద్య అంటే గొప్ప ఆస్తి. ఎవరూ అపహరించలేని సంపద. ఎప్పటికీ విలువ తగ్గని పెట్టుబడి. తమ పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని తల్లిదండ్రులందరూ ఆశిస్తారు. పిల్లల బంగారు భవితకు బాటవేసేది విద్యేననీ, వారికి మెరుగైన విద్యను అందించగలిగితే తమ బాధ్యతను నిర్వర్తించినట్లేననీ వారు విశ్వసిస్తారు. విద్య నానాటికీ ఖరీదైన వస్తువుగా మారిపోతోందనేది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా స్కూలు, కాలేజీ ఫీజులు ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఈ ఫీజులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఈ విద్యావ్యయాన్ని భరించడం చాలా కష్టం.
తమ పిల్లలు ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా ఎంబీఏ చదవాలని పలువురు తల్లిదండ్రులు భావిస్తుంటారు. పేరు ప్రతిష్టలు పొందిన విద్యాసంస్థలో ఎంబీఏ చదవడానికి ఎంత ఖర్చవుతుందో ఒక్కసారి గమనిద్దాం. ఐఐఎం-ఏలో ఎంబీఏ చదవడానికి 2003లో రూ.3.16 లక్షలు ఖర్చయ్యేది. 2009లో ఆ ఖర్చు రూ.12.50 లక్షలకు పెరిగిపోయింది. ఈ లెక్కన మరో పదేళ్ల తర్వాత ఎంబీఏ చదవడానికి రూ.22 లక్షలపైనే ఖర్చవుతుంది.
విద్యావ్యయంపైనే ఆలోచన ...
భారత్‌లో ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం... 81 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం, పెళ్లిళ్ల కంటే పెరుగుతున్న విద్యావ్యయంపైనే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. పరీక్షల్లో మార్కుల కంటే చదువు చెప్పించడానికి అవుతున్న ఖర్చు గురించే 30 శాతం మంది తల్లిదండ్రులు ఎక్కువ ఆలోచిస్తున్నారు. దాదాపు 69 శాతం మంది తల్లిదండ్రులు ఫీజుల ఆధారంగా ప్లే స్కూళ్లను ఎంపిక చేస్తున్నారు. ఉన్నత విద్య కోసం తమ పిల్లలను విదేశాలకు పంపాలని 10 శాతం మంది పేరెంట్లు భావిస్తున్నారు. పిల్లల భవిత కోసం పొదుపు చేస్తున్న వారి సంఖ్య 72 శాతంగా ఉంది.
పొదుపు పెంచాలి...
ఆలోచనలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు చేస్తున్న పొదుపు మొత్తాలు పెరగకపోవడం గమనార్హం. పొదుపు గురించి చాలామంది ఆలోచిస్తున్నప్పటికీ భవిష్యత్తులో విద్యావ్యయం ఏస్థాయిలో ఉంటుందో చాలా మందికి అవగాహన కలగడం లేదు. సమర్థమైన ఆర్థిక ప్రణాళికలూ కొరవడుతున్నాయి. ఉన్నత విద్యకు ఎంత ఖర్చవుతుందో తమకు తెలియదని 81 శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. యుక్తవయసులో ఉన్న తల్లిదండ్రులు ఏటా సగటున రూ.26 వేలు పొదుపు చేస్తున్నారు. ఇది 18 ఏళ్లకు కేవలం రూ.4.67 లక్షలవుతుంది. పిల్లల ఉన్నత విద్యకు ఇది ఏమాత్రం సరిపోదు. రుణాలు తీసుకోవడమో, ఇతరత్రా మార్గాల్లో సమకూర్చుకోవడమో చేయాల్సిందే. పిల్లలు పదో తరగతికి చేరినప్పటి నుంచే చదువుకయ్యే ఖర్చులు పెరిగిపోతాయి.
భవితకు తగిన ప్లానింగ్..
భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకుని, ఇన్వెస్ట్‌మెంట్లు చేసే తల్లిదండ్రుల సంఖ్య చాలా తక్కువ. చదువుకయ్యే ఖర్చును సమర్థంగా అధిగమించడానికి తగిన పద్ధతి ఇన్సూరెన్సేనని 50 శాతం మంది తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారు. తాము అకాల మృత్యువుకు గురైనప్పటికీ తమ పిల్లల చదువు కొనసాగడానికి బీమా దోహదపడుతుందని వారి నమ్మకం. అయితే, ఈ 50 శాతం మందిలో కేవలం 13 శాతం మంది మాత్రమే తమ పిల్లల ఉన్నత విద్యకు తగిన ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుని, నిర్దిష్ట బీమా పథకాల ద్వారా డబ్బు పొదుపు చేస్తున్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లలోనూ మదుపు చేస్తున్నారు. పిల్లల ఉజ్వల భవిత కోసం పెట్టుబడులు చేసేముందు, ఆ పెట్టుబడులపై ఆదాయం ఏ స్థాయిలో ఉంటుంది, రిస్కులు ఏమిటి అనే అంశాలు పరిశీలించాలి. పకడ్బందీ ప్రణాళికలతో పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించడం సులభసాధ్యమే.