డిస్కంలకు రూ.1,700 కోట్లు!
విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: తీవ్ర ఆర్థికసంక్షోభంలో చిక్కు కున్న తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను గట్టెక్కిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,700 కోట్లను పెట్టుబడి మూలధనంగా విడుదల చేసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలం గాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీ డీసీఎల్)లకు 70:30 నిష్పత్తిలో ఈ పెట్టుబడులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో రూ.724 కోట్లు, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో రూ.274 కోట్లు కలిపి రూ.998 కోట్ల మూలధనం వాటాలను రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఉంది. తాజాగా మరో 1,700 కోట్లను విడుదల చేయడం తో డిస్కంలలో రాష్ట్రవాటా రూ.2,698 కోట్లకు పెరిగింది.
జెన్‌కో, సింగరేణిలపై సంక్షోభ ప్రభావం..
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) ప్లాంట్ల నుంచి కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు డిస్కంలు చెల్లిం చాల్సిన పాత బిల్లుల బకాయిలు రూ.5,000 కోట్లు. వీటిని చెల్లించలేమని డిస్కంలు చేతులెత్తేశాయి. దీంతో జెన్‌కో విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేస్తున్న బొగ్గుకు సంబంధించిన బకాయిలను సింగరేణి సంస్థకు చెల్లించ లేకపోతోంది. దీంతో సింగరేణికి జెన్‌కో చెల్లించాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్లకు పేరుకుపోయాయి. డిస్కం ల ఆర్థిక సంక్షోభం జెన్‌కో, సింగరేణిలను ఆర్థికంగా దెబ్బ తీసింది. జెన్‌కో నుంచి బకాయిలను ఇప్పించాలని సింగ రేణి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తోంది. డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలను విడుదల చేయాలని గతంలో పలుమార్లు ట్రాన్స్‌కో కోరినా రాష్ట్ర ఆర్థిక శాఖ కొర్రీలు వేసింది. మరోవైపు ప్రైవేటు కంపెనీల నుంచి కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించలేక డిస్కంలు ఇబ్బందులు పడు తున్నాయి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవడానికి రూ.1,163 కోట్ల నిధుల్ని పెట్టుబడి మూలధనంగా విడుదల చేయాలని, 2014–15, 2015–16లకు సంబం ధించి డిస్కంలకు చెల్లించాల్సిన పాత సబ్సిడీ బకాయిలు రూ.957 కోట్లను విడుదల చేయాలని గత నెల 30న ప్రభుత్వానికి ట్రాన్స్‌కో లేఖ రాసింది. రూ.957 కోట్ల సబ్సిడీ బకాయిలపై మాత్రం ఏ నిర్ణయం రాలేదు.