ముంబై: ఒకవైపు వృద్ధి పెరుగుతోందంటున్నా... మరోవైపు ఉద్యోగాలు పెరగటం లేదన్న ఆందోళనలను నిజం చేస్తూ కేర్ రేటింగ్ ఏజెన్సీ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. వృద్ధి ఊపందుకుంటున్నా.. ఉద్యోగాలు మాత్రం ఉండటంలేదని, ఇది ‘చాలా ఆందోళనకరమైన అంశం’ అని పేర్కొంది.
ఇన్‌ఫ్రాకి ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చర్యలు కొంత తోడ్పాటు అందించగలిగేవే అయినా.. ప్రభుత్వం క్రియాశీలకంగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితులు సూచిస్తాయని కేర్ అభిప్రాయపడింది. ‘ఆర్థిక వృద్ధి అంత వేగంగా ఉద్యోగాల కల్పన కూడా పెరగటం లేదు. దాన్ని ఇది అందుకోలేకపోతోంది’’ అని వివరించింది. మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నా... ఉద్యోగాల మార్కెట్‌లో వృద్ధి ఉండకపోవడాన్ని ఉద్యోగరహిత వృద్ధిగా వ్యవహరిస్తారు.
బ్యాంకింగ్‌లో అత్యధికంగా ఉపాధి..
ఇటీవలి కాలంలో ఉపాధికి సంబంధించి రంగాలవారీగా పరిస్థితి చూస్తే.. సేవల రంగం కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఉద్యోగాల కల్పనలో తయారీ రంగం విఫలమైందని కేర్ తెలిపింది. అయితే, బ్యాంకింగ్, ఐటీ, రిటైలింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాల కల్పన జరుగుతుండగా.. మైనింగ్, విద్యుత్, టెలికం రంగాల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వివరించింది.
బ్యాంకింగ్‌లో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఈ విషయంలో దీని వాటా 21.3%గా ఉందని, ఐటీ, మైనింగ్, హెల్త్‌కేర్, టెక్స్‌టైల్స్ వంటివి తర్వాత స్థానాల్లో ఉన్నాయని కేర్ తెలిపింది. 2015 ఆర్థిక సంవత్సరంలో 1,473 కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 5.01 మిలియన్లుగా ఉండగా.. 2017లో ఇది అత్యంత స్వల్పంగా 1% వృద్ధితో 5.18 మిలియన్లకు పెరిగి నట్లు తెలిపింది. అదే ఆర్థిక వృద్ధి 7% నమోదైనట్లు వివరించింది. సగటు జీతభత్యాలు రూ. 7.13 లక్షల నుంచి రూ. 8.35 లక్షలకు పెరిగినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment