రుణ మాఫీలతో బ్యాంకులకు దెబ్బ: రాజన్
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న రుణ మాఫీ పథకాల వల్ల బ్యాంకుల స్థిరత్వం దెబ్బతింటుందని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. పరోక్షంగా ఇలాంటి పథకాలకు ఆర్‌బీఐ వ్యతిరేకమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారమిక్కడ నాబార్డ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పదేపదే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రుణ మాఫీలతో వడ్డీరేట్లపై దుష్ర్పభావం పడుతుంది. చివరకు ఇది మొత్తం రుణ మార్కెట్, బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది’ అని రాజన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రైతులకు రుణ మాఫీలను ప్రకటించడం.. దీనిపై బ్యాంకర్ల నుంచి ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. కాగా, సూక్ష్మ రుణ సంస్థలు(ఎంఎఫ్‌ఐ) వసూలు చేస్తున్న వడ్డీరేట్లపై తగిన పరిమితి విధించాల్సిన అవసరం ఉందని రాజన్ సూచించారు. రుణ గ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించడమే తన ఉద్దేశమని చెప్పారు.