సమీక్షకు ముందే రేట్ల కోత!
జూన్ 2లోపే ఉండొచ్చంటున్న ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూన్ 2 పాలసీ సమీక్షకు ముందే రుణ రేటును తగ్గించే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అంచనావేస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం.. పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ చర్య తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం వెలువడిన గణాంకాల ప్రకారం- ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 4.87%గా నమోదయ్యింది.
పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 5 నెలల కనిష్ట స్థాయిలో 2.1%గా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటును(బ్యాంకులను తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 7.5%) మరో పావుశాతం తగ్గించి, వృద్ధికి ఊతం ఇచ్చే అవకాశం ఉందని ఎస్‌బీఐ తెలిపింది.
సిటీగ్రూప్‌దీ అదే అభిప్రాయం
ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని వివరించింది. జూన్ పాలసీకి అటుఇటుగా మొదటి దఫా 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత ఉండే వీలుందని తెలిపింది.
నోమురాది కూడా ఇదే మాట..
జూన్‌లో 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత ఉండవచ్చని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అంచనావేసింది. వినియోగ ద్రవ్యోల్బణం 5-5.5% శ్రేణిలో ఉండే అవకాశం ఉందని అంచనావేసింది.