బ్లూచిప్స్ లో కొనుగోళ్ల జోరు..
♦ సెన్సెక్స్ 328 పాయింట్లు అప్, తిరిగి 26,000పైకి
♦ నిఫ్టీ 108 పాయింట్లు జంప్, 8,000కు చేరువలో
♦ 4 నెలల గరిష్టస్థాయిలో ముగిసిన సూచీలు
ఒక్కసారిగా బ్లూచిప్ షేర్లలో ఇన్వెస్టర్లు నిధులు కుమ్మరించడంతో మంగళవారం భారత్ మార్కెట్ ర్యాలీ జరిపింది. ఆసియా మార్కెట్లు కనిష్టస్థాయి నుంచి కోలుకోవడం, యూరప్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావడంతో భారత్ సూచీలు పరుగులు పెట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బలహీనంగా వున్న అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఇక్కడి ఈక్విటీలు నిరుత్సాహంగా మొదలైనా, కనిష్టస్థాయిల వద్ద బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరిపాయి. దాంతో ట్రేడింగ్ తొలిదశలో 100 పాయింట్లకుపైగా మైనస్‌లో వున్న బీఎస్‌ఈ సెన్సెక్స్ ప్లస్‌లోకి మళ్లింది. చివరకు 328 పాయింట్ల లాభంతో 26,007 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 108 పాయింట్ల పెరుగుదలతో 7,963 వద్ద క్లోజయ్యింది. రెండు సూచీలు ఈ స్థాయిలో ముగియడం నాలుగునెలల్లో ఇదే ప్రధమం.
ప్లస్‌లో 27 సెన్సెక్స్ షేర్లు
పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తూ సెన్సెక్స్-30లో 27 షేర్లు లాభాల్లో ముగిసాయి. మారుతి సుజుకి ఫలితాలు అంచనాల్ని మించడంతో ఆ షేరు 3.4 శాతం మేర పెరిగింది. టాటా స్టీల్, సిప్లా, బీహెచ్‌ఈఎల్, లుపిన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, మహీంద్రా, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, లార్సన్ అండ్ టుబ్రోలు 1-3.62 శాతం మధ్య పెరిగాయి. టొబాకో రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని కేంద్ర నిషేధించనున్నట్లు వార్తలు రావడంతో సిగరెట్ తయారీ కంపెనీ గాడ్‌ఫ్రే ఫిలిప్స్ షేరు 17 శాతం పతనమయ్యింది. ఐటీసీ షేరు ట్రేడింగ్ తొలిదశలో 2 శాతంపైగా క్షీణించినప్పటికీ, అటుతర్వాత మార్కెట్‌తోపాటే వేగంగా కోలుకుని 1.8 శాతం లాభంతో ముగిసింది.
బ్యాంక్ ఇండెక్స్ జూమ్...
ఆయా రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా బ్యాంక్ ఇండెక్స్ 2.02 శాతం పెరిగింది. మెటల్ ఇండె క్స్ 1.98 శాతం, రియల్టీ 1.93 శాతం, ఆటో ఇండెక్స్ 1.57 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి.