ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో కొనసాగవచ్చా? | Shortage of funds, infrastructure mar NGO initiatives | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో కొనసాగవచ్చా?

Published Mon, Jun 30 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో కొనసాగవచ్చా?

ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో కొనసాగవచ్చా?

నేను రిటైర్ కావడానికి ఇంకా పదేళ్ల సమయం ఉంది. నేను ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్, బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఫండ్స్  పనితీరు భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది ? నేను కొన్ని ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్‌ఎస్‌ఎస్)లలో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కొన్ని ఫండ్స్‌ను సూచించగలరు.   - మాధవి, విశాఖపట్టణం,
 
పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, విభిన్నరకాలైన మ్యూచువల్ ఫండ్స్‌ను (డైవర్సిఫికేషన్) ఎంచుకోవాలి.   మీ పోర్ట్‌ఫోలియో విషయానికొస్తే, డైవర్సిఫికేషన్ సరిగా లేదని చెప్పవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ టాప్ 200, హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్- ఈ రెండు ఫండ్స్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో దాదాపు ఒకలాగే ఉన్నాయి. అందుకని ఈ రెండు ఫండ్స్‌ల్లో ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినా ఫలితం ఒకలాగే ఉంటుంది.

 చాలా డైవర్సిఫైడ్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలో 25-30 శాతం వరకూ బ్యాంకింగ్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందుకని  బ్యాంకింగ్ రంగం వృద్ధి ఆశావహంగా ఉన్నప్పటికీ, బిర్లా సన్ లైఫ్ బ్యాంకింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ, క్వాంటమ్ లాంగ్ టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ల విషయానికొస్తే, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్‌సేవర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ట్యాక్స్ ప్లాన్, క్వాంటమ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
 
నేను యూటీఐ ఆపర్చునిటీ, క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, ఐడీఎఫ్‌సీ ప్రీమియర్ ఈక్విటీ, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్- ఈ ఫండ్స్‌ల్లో  ఐదేళ్ల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియో సమతూకంగానే ఉందా? నేను మరో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందో చెప్పండి?            - సుబ్రహ్మణ్య శర్మ, అన్నవరం
 
మీ పోర్ట్‌ఫోలియో బావుంది. యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్‌ను మినహాయిస్తే, మీ పోర్ట్‌ఫోలియో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ ప్లాన్ అనేది డెట్-ఓరియంటెడ్ బ్యాలెన్స్‌డ్ ఫండ్. ఈ ఫండ్ 40 శాతం ఈక్విటిల్లో, 60 శాతం ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్‌స్టుమెంట్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది కన్సర్వేటివ్ ఫండ్. ఈ ఫండ్ కారణంగా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీలు లభించినప్పటికీ, దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇది సరైన ఫండ్ కాదు.

ఈ ఫండ్ లేకపోయినా మీ పోర్ట్‌ఫోలియోకు ఎలాంటి ఢోకా లేదు. ఇక అదనంగా ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్న రూ. 2 లక్షల మొత్తాన్ని ఒకేసారి కాకుండా, ఆరు నెలల పాటు  కొద్ది మొత్తాల్లో మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఎలాంటి కొత్త ఫండ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
 
ఇటీవల కాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ జోరుగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో గతంలో నేను ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు లాభాల్లో ఉన్నాను. ఇప్పుడు ఆ లాభాలు బుక్ చేసుకొని బయటపడమంటారా? లేక నా పెట్టుబడులను కొనసాగించమంటారా?
 - ప్రకాష్ జైన్, హైదరాబాద్
 
మీరన్నట్లుగా ఇటీవల కాలంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు బాగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఈ రంగం ఫండ్స్ కూడా లాభాల బాటలో ఉన్నాయి. గతంలో  ఇన్వెస్టర్లు భారీ మొత్తాల్లో ఇన్‌ఫ్రా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఈ ఫండ్స్ అథపాతాళానికి పడిపోయాయి. మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ పరిస్థితులు మెరుగవడం, చాలా ఇన్‌ఫ్రా కంపెనీలు తమ తమ ఆస్తులను అమ్మేసి,(విక్రయం కాగల ఆస్తులనే ఈ కంపెనీలు అమ్మగలిగాయని గుర్తుంచుకోవాలి) రుణభారాన్ని తగ్గించుకుంటుండటంతో ఇన్‌ఫ్రా కంపెనీల ఆర్థిక పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో ఈ ఫండ్స్ పనితీరు మెరుగుపడింది.  

భారత్‌లో మౌలిక సదుపాయాల కొరత బాగాఉందని, ఫలితంగా ఈ కేటగిరి ఫండ్స్ పనితీరు బాగా ఉంటుందనే అభిప్రాయంతో గతంలో ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇది సరైన ప్రాతిపదిక కాదు. ఇన్వెస్టర్లు ఒక్క సెక్టోరియల్, ధీమాటిక్ ఈక్విటీ ఫండ్స్‌లకే తమ పెట్టుబడులను పరిమితం చేయడం సరికాదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు డైవర్సిఫికేషన్ అనేది తప్పనిసరి, అందుకే ఇన్‌ఫ్రా, మరే ఇతర సెక్టోరియల్ ఫండ్స్‌ను వదిలేసి,  మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న డైవర్సిఫైడ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.

ఏ రంగం షేర్లు ఎప్పుడు బాగా పెరుగుతాయో సగటు ఇన్వెస్టర్ కంటే ఫండ్ మేనేజర్లకు ఎక్కువ అవగాహన ఉంటుంది. దీంతో డైవర్సిఫైడ్ ఫండ్ మేనేజర్లు ఆయా సమయాల్లో పెరిగే అవకాశమున్న షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఫలితాలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అందుతాయి. మొత్తం మీద సెక్టోరియల్ ఫండ్స్ కంటే  డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉత్తమమని చెప్పవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement