ముంబై: అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాల కారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరడంతో రెండు రోజుల లాభాలకు బ్రేక్‌పడింది. ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు నష్టపోయి 33,006 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 10,115 పాయింట్ల వద్ద ముగిశాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ, వాహన, బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. లోహ షేర్ల సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
చైనాపై ఆంక్షలు..!
మేధోపరమైన హక్కులు, టెక్నాలజీ బదిలీలకు సంబంధించిన నియమ నిబంధనలను చైనా ఉల్లంఘిస్తోందని అమెరికా పేర్కొంది. చైనాపై నేడు(శుక్రవారం) అమెరికా ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే తమ ప్రయోజనాలు, హక్కుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని చైనా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధ భయాల ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. అంచనాలకు తగ్గట్లుగానే ఫెడ్ రేట్ల పెంపు ఉండటంతో కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 146 పాయింట్లు లాభంతో 33,282 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం, వాణిజ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేయడంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 173 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద 319 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 53 పాయింట్లు లాభపడగా, మరో దశలో 50 పాయింట్లు పతనమైంది.
ఏడాది కనిష్టానికి ఎస్‌బీఐ..
ఎన్‌ఎస్‌ఈ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ ముగింపు, చెన్నైకు చెందిన కనిష్క్ గోల్డ్ రూ.824 కోట్ల మేర మోసాలకు పాల్పడిందన్న వార్తల కారణంగా బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఎస్‌బీఐ ఇంట్రాడేలో 3 శాతం నష్టంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.241ను తాకింది. చివరకు 2.4 శాతం నష్టంతో రూ.242 వద్ద ముగిసింది.
ఓఎన్‌జీసీ 2 శాతం అప్...
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరడంతో చమురు ఉత్పత్తి సంస్థలు–ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, అబన్ ఆఫ్‌షోర్ తదితర షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ 1.8 శాతం లాభంతో రూ.178 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే.
వాణిజ్య యుద్ధ భయాలతో నష్టాలు
Published Fri, Mar 23 2018 1:06 AM | Last Updated on Fri, Mar 23 2018 1:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment