సియట్
బ్రోకరేజ్ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్
కొనొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,390 టార్గెట్ ధర: రూ.1,899
ఎందుకంటే: ఆర్‌పీ గోయెంకా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో అతి పెద్ద టైర్ల కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ అన్ని రకాల టైర్లను–ట్రక్, బస్సు, టూ, త్రీ వీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, తేలిక రకం వాణిజ్య వాహనాలు, వ్యవసాయ, స్పెషాల్టీ టైర్లను తయారు చేస్తోంది. అమ్మకాల్లో రీప్లేస్‌మెంట్ మార్కెట్ వాటా 61%, ఎగుమతులు 12 %గా ఉన్నాయి. 4,500 మంది డీలర్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 15% వృద్ధితో రూ.1,670 కోట్లకు పెరిగింది. టైర్ల అమ్మకాలు 18% పెరిగాయి. టూ వీలర్ల సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని సెగ్మెంట్ల టైర్ల ధరలను పెంచడం కంపెనీకి కలసివచ్చింది. స్థూల మార్జిన్ 5% ఎగసి 38.6%కి చేరింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, స్వల్పంగా (25 బేసిస్ పాయింట్లు) తగ్గింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ముడి పదార్థాల ధరలు 2 శాతం పెరిగినప్పటికీ, ఇబిటా 223 శాతం పెరిగి రూ.170 కోట్లకు చేరింది. నికర లాభం 307 శాతం వృద్ధితో రూ.78 కోట్లకు చేరింది. వచ్చే క్వార్టర్‌లో ముడి పదార్థాల ధరలు మరో 2–3 శాతం మేర పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి రూ.870 కోట్లుగా ఉన్న రుణభారం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది జూన్ నాటికి రూ.750 కోట్లకు తగ్గింది. ముడి పదార్థాల ధరలు పెరుగుతుండటంతో టైర్ల ధరలను ఈ కంపెనీ 1–2 శాతం మేర పెంచే అవకాశాలున్నాయి. ముడి చమురు, రబ్బరు ధరలు మరింతగా పెరిగితే మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఏబీబీ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
అమ్మొచ్చు
ప్రస్తుత ధర: రూ.1,184 టార్గెట్ ధర: రూ. 990
ఎందుకంటే: విద్యుత్ ప్రసార, పంపిణీ, ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ ఈ ఏడాది రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఇబిటా మార్జిన్ 7.8% ఉండొచ్చని అంచనా వేయగా 7.2% మాత్రమే సాధించగలిగింది. ఇబిటా 33% వృద్ధితో రూ.196 కోట్లకు చేరింది. అయితే రూ.210 కోట్ల ఇబిటా సాధిస్తుందని అంచనాలున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల ఇబిటా అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభం రూ. 100 కోట్లకు చేరింది. ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.2,710 కోట్లకు పెరిగింది. కంపెనీ ఫలితాల్లో ఇదొక్కటే అంచనాలను అందుకోగలిగింది. స్థూల మార్జిన్ 2.7% తగ్గి 33.5%కి చేరింది. ఈ కంపెనీ నికర దిగుమతిదారు కాబట్టి రూపాయి పతనం ప్రతికూల ప్రభావం(ఈ క్యూ2లో రూ.10 కోట్ల ఫారెక్స్ నష్టాలు వచ్చాయి) చూపించడం, ముడి పదార్థాల ధరలు పెరగడం.. ఈ మూడు కారణాల వల్ల స్థూల మార్జిన్ తగ్గింది. సోలార్, రైల్, డిజిటలైజేషన్ వంటి కొత్త రంగాలపై దృష్టి కారణంగా ఆర్డర్లు 7% పెరిగి రూ.2,500 కోట్లకు చేరాయి. అయితే ఈ కంపెనీ ఈ క్యూ2లో భారీ ఆర్డర్లను ఏమీ సంపాదించలేకపోయింది. మార్జిన్లు తక్కువగా ఉండే ప్రాజెక్ట్ వ్యాపారం అమ్మకాలు అధికంగా ఉండటం, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం కారణంగా కంపెనీ ఆదాయ అంచనాలను ప్రస్తుత ఏడాదికి 8%, వచ్చే సంవత్సరానికి 2% చొప్పున తగ్గించాం. విద్యుత్ ప్రసార, పంపిణీ రంగాలకు అవసరమయ్యే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సర్వీస్ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు సాకారం కావడానికి దీర్ఘకాలం పడుతుంది. ఈ షేర్ విలువ అధికంగా ఉందనే ఉద్దేశంతో అమ్మేయండి అనే రేటింగ్‌ను ఇస్తున్నాం.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment