పన్ను విధానాల్లో సమగ్రత లక్ష్యంగా కమిటీలు
న్యూఢిల్లీ: పన్ను విధానాల్లో సమగ్రతను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆర్థికశాఖ మంగళవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో ట్యాక్స్ పాలసీ కౌన్సిల్ (టీపీసీ) పేరుతో వేసిన కమిటీ ఆర్థికమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ట్యాక్స్ పాలసీ రిసెర్చ్ యూనిట్ (టీపీఆర్‌యూ) పేరుతో ఏర్పాటయిన మరొక కమిటీ రెవెన్యూ కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ద్రవ్య, పన్ను విధానాలకు సంబంధించి టీపీఆర్‌యూ అధ్యయనాలు జరిపి... ఆయా అంశాలను టీపీసీకి సమర్పిస్తుంది. ఈ అధ్యయనాల ప్రాతిపదికన టీపీసీ పన్ను అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. 2016 ఏప్రిల్ 1 నుంచీ ఈ రెండు కమిటీలూ పనిచేస్తాయని రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా ట్వీట్ చేశారు.