పన్నుల పెంపు లేనట్టే...!
బడ్జెట్‌పై అరుణ్‌జైట్లీ సంకేతాలు
తయారీ రంగానికి తీపి కబుర్లు!
9 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రతిపాదనలు
దావోస్: ఫిబ్రవరి 28వ తేదీన వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇందుకు సంబంధించి శుక్రవారం కీలక సంకేతాలు ఇచ్చారు. పన్ను రేట్లు పెంచబోమని సూచనప్రాయంగా తెలిపారు. అలాగే తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, రాయితీలు ఉంటాయని సూచించారు. దేశ ఆర్థిక వృద్ధి రేటు 9%కి పెరిగేలా వ్యవస్థాగత మార్పుల ప్రతిపాదనలు తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఉండనున్నట్లు సంకేతమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) సదస్సులో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
స్థిరమైన పన్నుల వ్యవస్థ తమ లక్ష్యమన్నారు. అసమంజసమైన డిమాండ్, గత వ్యవహారాలకు సైతం వర్తించే విధంగా పన్ను వ్యవస్థలో మార్పులకు తావులేని వైఖరిని అనుసరించనున్నట్లు వెల్లడించారు. తయారీ రంగం, ప్రత్యేకించి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం తమ ప్రభుత్వ లక్ష్యాలని తెలిపారు. ముడిచమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశమని విశ్లేషించారు. సబ్సిడీల హేతుబద్దీకరణపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు.
ఇక సాంప్రదాయేతర ఇంధనాలపై దృష్టి: గోయల్
ప్రజలందరనీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడానికి చేపట్టిన జన ధన యోజన విజయవంతంతో ఇకపై సాంప్రదాయేతర ఇంధన వనరుల రంగం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తామని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ దావోస్‌లో తెలిపారు. ఈ రంగంలోనూ రికార్డులు నెలకొల్పుతామని... ప్రతి ఇల్లు, పరిశ్రమ, వాణిజ్య సంస్థకు నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.