ఇతర నగరాలకూ టైగర్ ఎయిర్ | Tiger’s Taiwanese venture starts with Singapore; Bangkok, Da Nang and Chiang Mai up next | Sakshi
Sakshi News home page

ఇతర నగరాలకూ టైగర్ ఎయిర్

Published Thu, Oct 2 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

ఇతర నగరాలకూ టైగర్ ఎయిర్

ఇతర నగరాలకూ టైగర్ ఎయిర్

అంతర్జాతీయ చౌక విమానయానంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సింగపూర్ సంస్థ టైగర్ ఎయిర్... తన వ్యూహం మార్చుకుంటోంది. ఇప్పటిదాకా టైగర్ ఎయిర్ అంటే... భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లేవారి కోసం మాత్రమే పరిమితమనే భావన ఉండేది. దాన్ని తొలగించుకుని ఇతర అంతర్జాతీయ నగరాలకు కూడా హైదరాబాద్ సహా భారతదేశంలోని ఇతర నగరాలను కనెక్ట్ చేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేసియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, వియెత్నాం వంటి అనేక దేశాలకు అత్యంత చౌకగా తమ విమానాల్లో ప్రయాణించవచ్చునని, ఇందుకోసం ప్రత్యేకంగా ‘టైగర్ కనెక్ట్’ను ప్రవేశపెట్టామని సంస్థ కమర్షియల్ డెరైక్టర్ రాబర్ట్ యాంగ్ తెలియజేశారు. ‘టైగర్ కనెక్ట్ ఒక వినూత్న ఆలోచన. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా భారతీయ నగరాల నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారికిది బాగా ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు ఆస్ట్రేలియాలోని పెర్త్, సిడ్నీ, మెల్‌బోర్న్ తదితర నగరాలకు వెళ్లాలనుకునేవారు ముందుగా సింగపూర్ రావచ్చు. ఇక్కడ వీసా లేకుండానే(వీసా ఫ్రీ ట్రాన్సిట్ ఫెసిలిటీ-వీఎఫ్‌టీఎఫ్) నాలుగు రోజులు సిటీ మొత్తం చూడొచ్చు. సింగపూర్ నుంచి పెర్త్‌కు బయలుదేరొచ్చు. అదీ అందుబాటు ధరలోనే’ అని వివరించారు. మారుతున్న టైగర్ ఎయిర్‌వేస్‌ను పరిచయం చేయడానికి భారత్ నుంచి పాత్రికేయుల్ని ప్రత్యేకంగా సింగపూర్‌కు ఆహ్వానించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. తమ విమానాల్లో భద్రత, సమయపాలనకు పెద్దపీట వేస్తామన్నారు.

 రూ.10కే సింగపూర్ టికెట్
 ఒకవైపు సింగపూర్‌కు రూ.10 బేస్ ధరకే టికెట్ అందిస్తూ ఇటీవల ప్రవేశపెట్టిన పథకానికి అనూహ్యమైన స్పందన రావటంతో మళ్లీ ఈ పథకాన్ని అక్టోబర్ 6 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు యాంగ్ చెప్పారు. ఈ పథకం కింద ఇంచుమించు రూ.7,500కే సింగపూర్‌కు రిటర్న్ టికెట్ లభిస్తుందని, మామూలుగా టైగర్ ఎయిర్ రిటర్న్ టికెట్ రూ.12000 లోపే ఉంటుందని చెప్పారు. 6వ తేదీ నుంచి బుకింగ్‌లు ఆరంభమవుతాయని, ఆ తర్వాత 6 నెలల్లో ఈ టికెట్లను వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

 స్కూట్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం...
 ‘ప్రస్తుతం 14 దేశాల్లోని 50 నగరాలకు టైగర్ ఎయిర్ విమానాలు నడుస్తున్నాయి. అయితే మరింతమందికి చౌక ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు, టైగర్ సేవల్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు స్కూట్ ఎయిర్‌లైన్స్‌తో అవగాహన కుదుర్చుకున్నాం. దీనిప్రకారం టైగర్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించాలనుకునేవారికి స్కూట్ ఎయిర్ ప్రయాణించే నగరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఆయా నగరాలకు టైగర్ ద్వారా అందుబాటు ధరలకే టిక్కెట్లు బుక్ చేసుకుని స్కూట్ ఎయిర్‌లో కూడా ప్రయాణించొచ్చు’’ అని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement