హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూరోపియన్ కార్ల దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ వచ్చే రెండేళ్లలో కొత్తగా నాలుగు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌ను (ఎస్‌యూవీ) మార్కెట్లోకి తేనుంది. ప్రస్తుతం టిగువన్ ఎస్‌యూవీని దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయిస్తోంది. భారతీయులకు ఎస్‌యూవీలపై మక్కువ ఎక్కువని ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ డైరెక్టర్ స్టీఫెన్ న్యాప్ శుక్రవారమిక్కడ చెప్పారు. ఈ విభాగంలో రానున్న రోజుల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటామన్నారు. 2020లో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో నూతన మోడళ్లను ప్రదర్శిస్తామని తెలియజేశారు. కంపెనీ 20వ కార్పొరేట్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించేందుకు హైదరాబాద్‌కు వచి్చన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఫోక్స్‌వ్యాగన్ కార్లు ఖరీదైనవని కస్టమర్లు అనుకునేవారు. నాలుగేళ్ల వారంటీ, విడిభాగాల ధర 15 శాతం తగ్గించడం ద్వారా ఆ భావన నుంచి బయటపడేలా చేశాం’ అని చెప్పారు. ఎస్‌యూవీలతోపాటు మరో రెండు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
అయిదేళ్లలో 3 శాతం..
ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్‌కు 1.4 శాతం వాటా ఉంది. అయిదేళ్లలో 3 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు స్టీఫెన్ చెప్పారు. ‘ఇండియా 2.0 కార్యక్రమంలో భాగంగా 2022 నాటికి రూ.8,000 కోట్లు ఖర్చు చేయాలని గతేడాది నిర్ణయించాం. మోడళ్ల అభివృద్ధి, ఆర్‌అండ్ డీ కోసం ఈ పెట్టుబడి పెడతాం. పుణే ఆర్‌అండ్ డీ కేంద్రంలో ప్రస్తుతం 650 మంది ఇంజనీర్లు ఉన్నారు. దీనిని 5,000 స్థాయికి పెంచుతాం. భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్ కోసం ఇక్కడ కార్లను అభివృద్ధి చేస్తాం. బీఎస్–4 వాహనాల తయారీని డిసెంబర్ నుంచి నిలిపేస్తున్నాం. మార్కెట్లో బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనాల ధర డీజిల్ 12– 15 శాతం, పెట్రోల్ 5 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడళ్లన్నిటినీ కొనసాగిస్తాం. చార్జింగ్ స్టేషన్లు విరివిగా అందుబాటులోకి వచ్చాక ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రవేశపెడతాం’ అని తెలిపారు.
ఇక్కడ ఎస్‌యూవీలంటేనే ఇష్టం
Published Sat, Dec 7 2019 4:54 AM | Last Updated on Sat, Dec 7 2019 4:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment