సాక్షి, ముంబయి : లేడీస్ ఫుట్‌వేర్‌లో అక్రమంగా తరలించిన రూ.11.40 కోట్ల విలువైన 38 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం సీజ్ చేశారు. థాయ్‌లాండ్ నుంచి కంటెయినర్‌లో వచ్చిన ఈ సరుకులను డోంగ్రికి చెందిన దిగుమతిదారు అల్ రెహమ్ ఇంపెక్స్ సంస్థ భారత్‌కు రప్పించింది. అయితే ఇవి మహిళలు ఉపయోగించే బాత్‌రూమ్ స్లిప్పర్ అని అధికారులకు చెప్పారు. థాయ్‌లాండ్ నుంచి దిగుమతైన కంటెయినర్‌పై సందేహాలు నెలకొనడంతో ఈనెల 21న చేరుకున్న ఈ కన్‌సైన్‌మెంట్‌ను కస్టమ్స్ పరిశీలన కోసం సేవ్రి టింబర్ పాండ్‌కు తరలించారు.
కంటెయినర్‌ను పరిశీలించిన అధికారులు మహిళల స్లిప్పర్స్‌లో ఒక్కోటి కిలో బరువున్న 38 బంగారు కడ్డీలు కనుగొన్నారు. వీటిపై థాయ్‌లాండ్ మార్కింగ్స్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ జరుగుతోందని కస్టమ్స్ కమిషనర్ ప్రాచీ సరూప్ తెలిపారు. 1993 ముంబయి పేలుళ్లకు ముందు సముద్ర మార్గం గుండా గోల్డ్ స్మగ్లింగ్‌ను ఈ ఘటన గుర్తుకుతెచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ఏడాది మేలో దుబాయ్ నుంచి అక్రమంగా తరలించిన రూ.15 కోట్ల విలువైన 52 కిలోల బంగారాన్ని ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఈ రాకెట్‌లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్తను అరెస్ట్ చేశారు.