పుట్టినరోజు కేక్‌లో విషం! | Birthday Cake Poisoned Father And Son Died In Siddipet | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు కేక్‌లో విషం!

Published Fri, Sep 6 2019 2:18 AM | Last Updated on Fri, Sep 6 2019 11:58 AM

Birthday Cake Poisoned Father And Son Died In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట/చేర్యాల: తండ్రి తర్వాత తండ్రి బాబాయి. తండ్రి కన్నా ప్రేమగా చూసుకోవాల్సిన ఆయన పుట్టిన రోజు బహుమతిగా పంపిన కేక్‌లో విషం కలిపాడు. పాత పగకు ప్రతీకారంగా చేసిన కుట్ర ఫలితంగా పుట్టినరోజు సంబురంలో కేక్‌ కట్‌చేసి, ఆ కేక్‌ తండ్రి చేతుల మీదుగా తిన్న కుమారుడు, కుమారుడి చేతుల మీదుగా తిన్న తండ్రి చనిపోగా.. అక్క మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్‌కు, ఐనాపూర్‌ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(నాగలక్ష్మి)కి 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పూజిత (12), రామ్‌చరణ్‌ (9) అనే పిల్లలున్నారు. రవీందర్‌కు వరుసకు తమ్ముడు అయ్యే శ్రీనివాస్‌తో తరచూ గొడవలు అవుతుండేవి. దీంతో రవీందర్‌ తన భార్యబిడ్డలతో కలసి అత్తగారి ఊరైన ఐనాపూర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. 

ఈ క్రమంలో బుధవారం ఐనాపూర్‌లో బంధువు మృతి చెందడంతో అక్కడికి వచ్చిన శ్రీనివాస్‌ తన అన్న కుమారుడు రామ్‌చరణ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ అదే రోజు తన పుట్టినరోజు అని చెప్పడంతో.. ‘నీ పుట్టిన రోజు సందర్భంగా నేను సిద్దిపేట నుంచి కేక్‌ పంపిస్తాను. సంబురంగా కేక్‌ కట్‌చేసుకో’అని శ్రీనివాస్‌ చెప్పాడు. బాబాయి మాటలు విన్న రామ్‌చరణ్, తల్లిదండ్రులతో పుట్టిన రోజు వేడుకలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో బేకరీలో కేక్‌ కొన్న శ్రీనివాస్‌ ఆ కేక్‌లో విషం కలిపి ఐనాపూర్‌ బస్సుకు తన అన్న కుమారుడు రామ్‌చరణ్‌కు ఇవ్వాలని చెప్పి పంపించాడు.

బాబాయి పంపిన కేక్‌ను తీసుకున్న రామ్‌చరణ్‌ సంబురంగా రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ కేక్‌ను తల్లిదండ్రులు రవీందర్, భాగ్యలక్ష్మిలు కుమారుడికి తినిపించారు. అదేవిధంగా అమ్మా, నాన్న, అక్కకు రామ్‌చరణ్‌ ఆ కేక్‌ను తినిపించాడు. కేక్‌ తిన్న కొద్ది సేపటి తర్వాత కుడుపులో తిప్పుతోందని రామ్‌చరణ్‌ తల్లిదండ్రులకు చెప్పడంతో కుమారుడిని తీసుకొని బయటకు వచ్చారు. అప్పటికే రవీందర్‌కు కూడా నోటిమాట రాకపోవడంతోపాటు, కుమార్తె పూజిత, భాగ్యలక్ష్మి కూడా అస్వస్థతకు గురయ్యారు. 

దీంతో గ్రామస్తులు నలుగురిని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రామ్‌చరణ్‌(9), తండ్రి రవీందర్‌(38) పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ ఈ ఇద్దరు గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కుమార్తె పూజిత పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భాగ్యలక్ష్మికి సిద్దిపేట ఆస్పత్రిలో డాక్టర్లు చికిత్స నిర్వహిస్తున్నారు. 

పోలీసుల అదుపులో నిందితుడు..
కేక్‌లో విషం కలిపి అన్న కుమారుడు, అన్న మృతికి కారకుడైనట్లు భావిస్తున్న శ్రీనివాస్‌ను గురువారం సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీసీపీ నర్సింహారెడ్డి, సిద్దిపేట వన్‌టౌన్‌ సీఐ సైదులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మిని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సైదులు తెలిపారు. అయితే కేక్‌ పంపించింది తానే కానీ అందులో ఏమీ కలపలేదని నిందితుడు పోలీసులతో చెబుతున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement