ఖమ్మంక్రైం : నగరంలోని నిజాంపేట ప్రాంతం. కొందరు యువకులు రోడ్డు పైకి వచ్చారు. రెండుగా విడిపోయారు. ఆవేశంతో ఊగి పోతున్నారు. ఒకరినొకరు మింగేసేంత కోపం తో గుడ్లురిమి చూసుకుంటున్నారు. ఏం జరిగిందోనని చుట్టుపక్కల వారు ఆరా తీయసాగారు. ఇంతలోనే ఆ యువకుల చేతులు కలిశాయి. కొందరి చేతుల్లోకి అప్పటికప్పుడు కర్రలొచ్చాయి. ఎవరు ఎవరిని కొడుతున్నారో తెలియదు... ఎందుకు కొడుతున్నారో తెలి యదు. అంతలోనే పోలీసులొచ్చారు.
పారి పోతున్న కొందరు యువకులను పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించారు. కొన్ని గంటల్లోనే ఆ యువకులు రొమ్ము విరుచుకుంటూ, ‘విజయ గర్వం’(??)తో బయటికొచ్చారు.
నగరంలోని గట్టయ్య సెంటర్‌లో ఇనుప రాడ్లు, క్రికెట్ బ్యాట్లతో రెండు గ్రూపులుగా రోడ్డు పైకి వచ్చి దెబ్బలాడుకుంటున్న యువకులను పోలీసులు తీసుకెళ్లారు. గంటల వ్యవధిలో ఆ యువకులు కాలర్ ఎగరేసుకుంటూ బయటికొచ్చారు.
ఒక రోజున నిజాంపేట...మరో రోజున గట్టయ్య సెంటర్...సేమ్ టు సేమ్...గ్యాంగ్.. గ్యాంగ్.. గ్యాంగ్ లీడర్...! నగరంలో ఇటీవలి కాలంలో కొందరు విద్యార్థులు, యువకులు, జులాయిలు ఇలా ‘గ్యాంగ్’గా ఏర్పడి, చిన్న చిన్న విషయాలకే ‘వార్’కు దిగుతున్నారు. ఈ ముఠాలకు నాయకత్వం వహిస్తున్న యువకులు తమను తాము ‘గ్యాంగ్ లీడర్’గా ఊహించు కుంటున్నారు. తమ భవిష్యత్తును తామే దెబ్బ తీసుకుంటున్నారు.
పోలీసుల చోద్యం..!
ఈ యువకులు ఇలా రోడ్లపైకి వచ్చి తన్నుకుం టుంటే పోలీసులు ఏం చేస్తున్నారోనని మీకు సందేహం రావచ్చు. పాపం.. వారు మాత్రం ఏం చేస్తారు... చోద్యం చూస్తున్నారు...! నిజమే... ఇది, వారిని తప్పుపడుతూ అంటున్న మాట కాదు..!! ఇలా తన్నుకుంటున్న వారిలో విద్యార్థులు, యువకులు, జులాయిలు.. ఇలా రకరకాల వారు ఉంటున్నారు. వీరిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లిన కొద్దిసేపటికే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు రంగంలోకి దిగుతున్నారు.
కొందరైతే పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి, ‘‘ఫలానా పిల్లలు మావాళ్లే. వదిలేయండి’’ అని చెబుతున్నారు. ఇంకొందరైతే, నేరుగా స్టేషన్‌కు వెళ్లి బయటకు తీసుకొచ్చు కుంటున్నారు. ఇది పదేపదే పునరావృత మవుతుండడంతో పోలీసులు కూడా విసు గెత్తారు. అందుకే, ‘గ్యాంగ్‌వార్’కు దిగిన వారిని తప్పనిసరి అయితేనే స్టేషన్‌కు తీసుకొస్తున్నారు.
జులాయిలకు వకాల్తా..
తెలిసీతెలియని వయసులో గొడవలకు దిగిన విద్యార్థులనో/యువకులనో నాయకులు విడిపించుకుని వెళ్లారంటే అర్థముంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ ఇలా జరగడం లేదు. త్రీ టౌన్ ప్రాంతంలోని బొక్కలగడ్డకు చెందిన ఓ రౌడీషీటర్, తన వెంట గ్యాంగ్‌ను వేసుకుని రోడ్లపై ఇష్టారాజ్యంగా భీభత్సం సృష్టిస్తుంటే పోలీసులు వెళ్లారు. చివరికి, పోలీసులపై కూడా ఆ రౌడీషీటర్ తిరగబడ్డాడు. పోలీసులు వాడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. చివరికి, స్టేషన్‌లో కూడా, ‘‘చూస్కోండి.. మా వాళ్లు వస్తారు’’ అంటూ ఆ రౌడీషీటర్ వీరంగం వేశాడు. వాడు చెప్పిందే నిజమైంది..! ఈ జులాయిల తరఫున కూడా ఆ అధికార పార్టీ నాయకులు వకాల్తా పుచ్చుకున్నారు. ఆ రౌడీషీటర్‌ను, అతడి గ్యాంగును వదిలిపెట్టేంత వరకు పోలీసులను వదల్లేదు... అంతగా ఒత్తిడి తెచ్చారన్న మాట.
ప్చ్.. ఏం చేస్తాం..? ఏమీ చేయలేం..!
ఖమ్మంలో ‘గ్యాంగ్ వార్’ సంస్కృతి పెరగడంపై ఓ పోలీస్ అధికారిని ‘సాక్షి’ వివరణ కోరింది. ఆయన చాలా నిర్వేదంతో... ‘‘నిజమే.. గ్యాంగ్ వార్‌లకు దిగుతున్నారు. అదుపు చేయటానికి మేం ప్రయత్నిస్తున్నాం. కానీ, మాపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయి. మా చేతులు కట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మేం ఏం చేస్తాం..? ఏమీ చేయలేం’’ అని, నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇలా రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్న యువకు లను చూస్తుంటే.. అప్పుడెప్పుడో ఓ సినీ కవి రాసిన ఈ పాట గుర్తుకొస్తున్నది కదూ...‘కుర్రాళ్లోయ్..! కుర్రాళ్లూ...!! వెర్రెత్తీ.. ఉన్నోళ్లు...!!’
Comments
Please login to add a commentAdd a comment