రైల్వే శాఖ తప్పిదంతో మానసిక వేదన అనుభవించిన ఆ వృద్ధుడు.. చివరకు న్యాయపోరాటంలో విజయం సాధించారు. బలవంతంగా రైలు దించేయటంతో రైల్వే శాఖపై పోరాటానికి దిగారు. ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు వడ్డీతో సహా నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖను వినియోగదారుల ఫోరమ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే...
లక్నో: షరన్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ ఫ్రొఫెసర్ విష్ణుకాంత్ శుక్లా(72) 2013లో నవంబర్ 19వ తేదీన కన్నౌజ్ వెళ్లేందుకు టికెట్‌ను తీసుకున్నారు. అయితే టికెట్ ప్రింట్ మీద 2013కి బదులు.. 3013గా ముద్రణ అయ్యింది. అది గమనించని విష్ణుకాంత్.. రైల్వే ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు. టీసీ తనిఖీలో వెయ్యి సంవత్సరాల తర్వాత తేదీ ముద్రించి ఉండటం గమనించిన ఆయన ఖంగుతిన్నారు. టీసీ రూ.800 ఫైన్ రాయటంతో ఆయన వాగ్వాదానికి దిగాడు. చివరకు ఆర్‌పీఎఫ్ పోలీసుల సాయంతో ఆయన్ని బలవంతంగా తర్వాతి స్టేషన్‌లో కిందకు దించేశారు.
ఈ వ్యవహారంపై ఆయన షరన్‌పూర్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించగా, విచారణ కొనసాగుతూ వస్తోంది. ‘అందరి ముందు తనను అవమానించారని, అందుకు పరిహారం చెల్లించాలని’ విష్ణుకాంత్ వాదించగా, టికెట్ జారీ అయ్యాక పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులదేనని రైల్వే శాఖ వాదించింది. అయితే ఫోరమ్ చైర్మన్ మాత్రం రైల్వే శాఖ వాదనతో విబేధించారు. ‘70 ఏళ్ల వృద్ధుడ్ని మానసికంగా హింసించినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని’ రైల్వే శాఖను ఆదేశించింది. పరిహారం కింద రూ.10,000 మరియు టికెట్ ధర.. వడ్డీతో కలిపి మరో రూ.3 వేలు చెల్లించాలని ఫోరమ్ బుధవారం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment