పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత మహిళలు
గుంటూరు ,పొన్నూరు : ఇరవై ఏళ్లుగా గ్రామస్తులను నమ్మించి చీటీ పాటలు నిర్వహిస్తూ మరో వైపు వడ్డీ వ్యాపారం చేస్తూ ఒక మహిళ చివరకు రూ.35 లక్షల వరకూ టోకరా పెట్టిన ఉదంతమిది. బాధితుల కథనం ప్రకారం... మండల పరిధిలోని ములుకుదురు గ్రామానికి చెందిన ఊటుకూరు పద్మావతి చీటి పాటలు నిర్వహిస్తూ ఉంటుంది. కొన్నినెలల నుంచి చీటీల కాలపరిమితి ముగిసినప్పటికీ పాట దారులకు డబ్బు చెల్లించకుండా కాలం గడుపుతూ వస్తోంది. ఈ క్రమంలో కొంతమందికి ప్రామిసరీ నోట్లు కూడా రాసింది. పొలం అమ్మి పాటదారులకు డబ్బు చెల్లిస్తానని నమ్మ బలికింది. ఆ క్రమంలోనే గత నెలలో పొలం విక్రయించి రూ.30 లక్షలు సొమ్ము చేసుకుంది.
కానీ పాటదారులకు మాత్రం నయాపైసా కూడా చెల్లించలేదు. తాజాగా గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. రూ.లక్షలు పద్మావతికి చీటీ పాటల రూపంలో చెల్లించిన బాధిత మహిళలు ఇక చేసేది లేక మంగళవారం రూరల్ ఎస్సై మీసాల రాంబాబును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎస్సై రాంబాబు చీటి పాటల నిర్వాహకురాలు ఊటుకూరి పద్మావతిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. తమకు ఎలాగైనా నగదు ఇప్పించాలని బాధిత మహిళలు ఎస్సైకు మొర పెట్టుకున్నారు. కాగా చీటీ పాట నిర్వాహకురాలు పద్మావతి బాధితులు ములుకుదురులోనే కాకుండా గుంటూరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో కూడా ఉన్నారని, వారంతా త్వరలోనే బయటకు వస్తారని బాధిత మహిళలు తెలిపారు.
రూ. 50 వేలు మాత్రమే ఇచ్చింది..
నేను రూ.లక్ష చీటీ వేశా. చీటి పూర్తయి చాలా రోజులు అయింది. రూ.లక్షకు గాను రూ. 50 వేలు చెల్లించింది. మిగతా డబ్బు అడిగితే ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోంది. మాది చాలా పేద కుటుంబం. కష్టపడి సంపాదించి చీటీ కడితే సదరు మహిళ నమ్మించి మోసం చేసింది. – షేక్ ఖాశింబీ, బాధితురాలు, తక్కెళ్లపాడు
నా కూతురిని ఇంటికి పంపేశారు..
మా కుమార్తె పేరుతో రూ.3 లక్షల చీటీ కట్టా. ఆరు నెలల కిందటే చీటీ కాల పరిమితి పూర్తయ్యింది. పొలం అమ్మి డబ్బులు ఇస్తానని సదరు మహిళ చెప్పింది. ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. నా కూతురిని అత్తారింటి వారు డబ్బులు తీసుకురమ్మని మూడు నెలల కిందట పంపేశారు. కూతురి కాపురం దెబ్బతినేలా ఉంది.
– జంపని సీతామహాలక్ష్మి,బాధితురాలు, ములుకుదురు
Comments
Please login to add a commentAdd a comment