శ్రీకృష్ణుడి ఇంటర్వ్యూ | Lord Krishna Interview | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడి ఇంటర్వ్యూ

Published Tue, Aug 27 2013 7:31 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

శ్రీకృష్ణుడి ఇంటర్వ్యూ

శ్రీకృష్ణుడి ఇంటర్వ్యూ

శ్రీకృష్ణుడి పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజో సరిగ్గా శ్రీకృష్ణుడికే తెలియదు. అయినా శ్రీకృష్ణుడికి వయసుతో పనేంటి. ఆయన చెప్పినవన్నీ అన్ని కాలాలకు, అన్ని వయసులవారికి, అన్ని వర్గాలవారికి ఉపయోగపడేవే కదా. మరో విషయం సెలబ్రిటీల వయసు, ఆడవాళ్ల వయసు అడక్కూడదు. కృష్ణుడిని మించిన సెలబ్రిటీ ఉన్నాడా చెప్పండి. ఆయన పుట్టినరోజనగానే మొత్తం మీడియా అంతా గోకులానికి వచ్చేశారు. మీడియా లీడర్ మిస్టర్ నారద. ఎవరు ఏ ప్రశ్నలు అడగాలో, ఏవిధంగా శ్రీకృష్ణుడిని మెలికలు పెట్టాలో, అంతా ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు ఆ కపట నాటక సూత్రధారి అయిన కలహభోజనుడు. శ్రీకృష్ణుడు, యశోద, సత్యభామ, రుక్మిణి, దేవకీవసుదేవులు, అర్జునుడు, ద్రౌపది... ఇత్యాది ఫ్యామిలీ సభ్యులంతా శ్రీకృష్ణుడు ఏం మాట్లాడబోతున్నాడా అని ఇంత కన్నులు చేసుకుని ఎదురుచూస్తున్నారు.
 
 శ్రీకృష్ణుడు మాత్రం నవ్వురాజిల్లెడు మోముతో స్థితప్రజ్ఞతతో ఉన్నాడు. లీలామానుషవిగ్రహుడు, నల్లనివాడు, పద్మనయనాలవాడు, కృపారసం పైచల్లెడివాడు, నవ్వురాజిల్లెడుమోమువాడు అంటూ రిపోర్టర్లందరూ శ్రీకృష్ణుడికి పోతన గారు చెప్పిన విశేషణాలన్నీ ఏకరువు పెడుతున్నారు.
 ఒక్కొక్కరూ ఒక్కో ప్రశ్న అడగటం ప్రారంభించారు.
 
 1. మీరు పుడుతూనే తల్లిని విడిచి యశోద దగ్గరకు వెళ్లిపోయారు కదా? మరి తల్లిని క్షోభకు గురి చేయడం సబబనుకుంటున్నారా.
 
 ప్రతిమనిషి జీవితం ముందుగానే లిఖించబడి ఉంటుంది. మీకో విషయం చెప్పనా, నేను నా తల్లిని విడిచి వెళ్లడం వల్లనే ఈ రోజు ఇంత మంది ముందు మాట్లాడగలుగుతున్నానని నా తల్లి ఎంతో సంబరంగా చె బుతోంది. ఆరోజు అమ్మకావాలంటూ ఆవిడ దగ్గరే ఉండి ఉంటే, నేనెవరో, నా పేరేంటో తెలియకుండానే నేను అంతమైపోయి ఉండేవాడిని. నేను ప్రపంచానికి తెలియాలి కాబట్టే యశోద దగ్గరకు చేరాను. అలా నా తల్లి నన్ను అభిమానించిందే కాని, దుఃఖించలేదు. తన కుమారుడు ప్రయోజకుడైతే ఏ తల్లి మాత్రం ఆనందించదు చెప్పండి. ఒక కష్టం వెంట సుఖం ఉంటుందని అర్థం చేసుకోవడానికే ఈ లీల అంటూ తన సహజధోరణిలో చిరు మందహాసం చేశాడు శ్రీకృష్ణుడు.
 
 2. ఇంతలో మరో రిపోర్టర్, యశోదమ్మ దగ్గర అన్ని నాళ్లు పెరిగి, ఆవిడను ఒక్కసారిగా విడిచిపెట్టి కన్నతల్లి దేవకీదేవి దగ్గరకు వెళ్లిపోయారు, అంటే పెంచిన తల్లి కంటె, కన్నతల్లే గొప్పదని మీ భావనగా అనిపిస్తోంది. దీనిపై మీ స్పందన చెబుతారా?
 
 కన్నతల్లి అయినా, పెంచిన తల్లి అయినా తల్లి తల్లే. ఒకరు రక్తం పంచితే, ఒకరు ప్రేమానురాగాలను, ఆప్యాయతానురాగాలనూ, స్నేహబాంధవ్యాలనూ అలవర్చారు. నాకు ఇద్దరూ తల్లులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం మనసులో కూడా కలగదు. పేగు తడి ఆరకుండా దేవకీదేవి నుంచి విడివడి, యశోదామాత దగ్గరకు చేరి ఆవిడ పాలిచ్చి పెంచింది. ఆవిడ దగ్గరకు చేరడం వల్లనే పూతనను, శకటాసురుడిని, బకాసురుడు... వంటి రాక్షసులను బాల్యంలో అంతం చేశాను. కాళీయుడిని సంహరించాను, గోవర్థనగిరి ఎత్తి గోపాలురను కాపాడి, ఇంద్రుడి గర్వం అణిచాను. ఇదేదో నా గొప్పదనం కాదు. నా చేత ఈ పనులు జరగాలని సంకల్పం జరగడం వల్లే నేను గోకులానికి రావడం, దుష్టసంహారం చేయడం వంటివి జరిగాయి. ఇదేదో నా గొప్పదనం అనుకునే మూర్ఖుడిని కాను నేను. ఎవరి చేత ఏ పనులు ఎక్కడ జరగాలని రాసి ఉండే, అక్కడ ఆ పనులు, వారి చేతిలో నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఈ సిద్ధాంతాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయాలనే నేను ఇక్కడికి వచ్చి ఉంటాను.
 
 3. నువ్వు శృంగార పురుషుడవని, 16 వేల మంది గోపికలను వివాహమాడావని, వీరు కాక నీకు అష్టభార్యలని చెబుతారు. మరి నువ్వు మహాపురుషుడివి ఏ విధంగా అవుతావు.
 
 తన సహజమైన మోమురాజిల్లెడి నవ్వుతో, అవును అందరూ అలా భ్రమపడడంలో తప్పులేదు. నా తత్త్వం నచ్చినవారంతా నన్ను కావాలని కోరుకున్నారు. వారు నన్ను మనస్పూర్తిగా వారి మనసులలో ధ్యానించారు. వారికి నేను ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షం కావడమంటే నేను భౌతికంగా నిలబడటం కాదు, వారి కోరిక మేరకు వారి మనసులలో ప్రత్యక్షం అయ్యాను. ఇది మీకు మాత్రం అనుభవంలో లేదా, మీ మనసుకి నచ్చినవారు మీ ముందర నిలబడినట్లు మీరు అనుభూతి చెందలేదా చెప్పండి, ఇక అష్టభార్యలన్నారు... నేనంటే ప్రీతి ఉన్నవాళ్లు రాధ నా ప్రేయసి అన్నారు. ఇదీ చాలనివాళ్లు నేనొక శృంగారపురుషుడిని అన్నారు. ఒక వ్యక్తికి పేరుప్రఖ్యాతులు వచ్చినప్పుడు ఆయన మీద ఏ విధంగా నింద వేయాలా అని ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీద బురద చల్లితే వచ్చే పాపులారిటీ అంతాఇంతా కాదు. శ్రీకృష్ణుడు గొప్పవాడు అన్నారనుకోండి, వారిని ఎవ్వరూ గుర్తించరు, అదే శ్రీకృష్ణుడు దుర్మార్గుడు... లాంటి విశేషణాలు చేర్చార నుకోండి, వారికి ఎంత పాపులారిటీనో మీ మీడియావారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మా నారదుడు ఇటువంటి విషయాలను చాలా తొందరగా ముల్లోకాలకూ ప్రచారం చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే నాకున్న మరో విశేషణం మీరు మరచిపోయినట్లున్నారు. నేను అస్ఖలితబ్రహ్మచారిని. దానికి అర్థం మీకు వివరించనక్కరలేదనుకుంటాను.
 
 4. భగవద్గీత బోధించి అందులో అన్నీ నేనే అని చెప్పుకోవడంలో మీ అహంకారం కనిపిస్తోంది...
 
 అసలు అహంకారం అనే పదానికి ముందర అర్థం తెలుసుకోండి. అహం అంటే నేను అనే భావన. నేను అనే భావన ప్రతివారికీ ఉండాలి. అంతేకాని నేను అనే గర్వం ఉండకూడదు. ఒకవ్యక్తి కొన్ని మంచి విషయాలు వివరించేటప్పుడు నేను అన్నాడంటే, అక్కడ వ్యక్తిగా నేను కాదు, అతీతశక్తి అనే నేను. అంటే పోతనగారు వివరించినట్టుగా ‘పెంజీకటికవ్వలనెవ్వండేకాకృతి వెలుంగు అతడినే సేవింతున్’ అని ఎవరిని వర్ణించాడో, ఆ వ్యక్తి ఇక్కడ నేను అని అర్థం. అంటే సృష్టిలోని ప్రతి గొప్పపదార్థం ఆ నేనుతో సమానమే కాని, అక్కడ శ్రీకృష్ణుడు అనే నేను కాదు.
 
 5. అవును మీ దేవుళ్లందరూ ఎందుకు నల్లగా ఉంటారు.
 
 అదే గొప్పదనం. నేను నల్లగా ఉంటాను కాబట్టే కృష్ణుడినయ్యాను. ప్రపంచం చీకటిమయం. ఆ చీకటికి అవతలే సృష్టికర్త ఉన్నాడు. మనమందరం అజ్ఞానమనే చీకటిలో ఉన్నామనడానికే నేను, రాముడు, శివుడు నల్లగా ఉన్నాం. మా నుంచే నలుపు నాణ్యం అనే పదం వచ్చిందేమో.
 
 6. నువ్వ రాయబారం చేయడం వల్ల యుద్ధం ఆగకుండా వంశనాశనం అయింది కదా
 
 దుష్టశిక్షణ, శిష్టరక్షణ మన సిద్ధాంతం. దుష్టులను మంచి మాటలతోమార్చాలని ప్రయత్నం చేశాం. కాని మారలేదు. ఒక దుష్డుడి మదిలో చెడు ఆలోచనకు బీజం పడిందంటే ఆ బీజం మహా విషవృక్షమై, మంచిని కూడా నాశనం చేసేస్తుంది. అందుకే ఆ శక్తి నాతో ఆ పని చేయించి ఉంటుందనుకోవచ్చుగా.
 
 7. నువ్వే అంత శక్తి సంపన్నుడివి, మహిమలు గలవాడివి అయితే, ద్రౌపది మాన భంగం జరుగుతున్నప్పుడు అంత అవమానం జరగకుండా ముందే ఆపచ్చు కదా, నిన్ను ప్రార్థిస్తేనే కాని ఆవిడకు చీరలు అందచేయలేదు. ఇది సరేనా
 
 నేను శక్తిసంపన్నుడనని, మాయలు చేయగలవాడినననీ ఎప్పుడూ చె ప్పలేదే. నిజంగా మాయగాడినైతే, తల్లి చేత దెబ్బలు తింటానా, రోటికి తాళ్లతో కట్టించుకుంటానా, అంతమంది రాక్షసుల కారణంగా మృత్యువుతో చెలగాటమాడి ఉంటానా, అక్కడ ఆవిడకు జరుగుతున్న మాన భంగం సమాచారం నాకు చేరగానే, హుటాహుటిన ఆమెను రక్షించానే తప్ప, నేనేమీ మహిమలు, మహత్తులు కలిగినవాడిని కాను. నేను సామాన్య మానవుడినే, సామాన్యుడిగానే జీవించాను, గురువుల వద్ద విద్య అభ్యసించాను, స్నేహితులతో ఆటలాడాను, గోవులను కాశాను. అల్లరిపనులు చేశాను. చిలిపి దొంగతనాలుచేశాను. నేను మహిమలు గలవాడినైతే, ఇక్కడి నుంచే నాకు ఏది కావాలనుకుంటే దానిని రప్పించుకునేవాడినే కదా. నా గురించి ఎవరికి తోచినట్టు వారు విమర్శించుకుంటూ ఆనందిస్తున్నారు. ఎవరి ఆనందం వారిది. ఆ విధంగా కూడా నేను వారికి ఉపయోగపడ్డానంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.
 
 8. నువ్వేదో జగద్గురువువని అహంకారంగా ఉంటావట కదా
 
 నేను జగద్గురువునని ఏనాడూ నా అంతట నేను చెప్పుకోలేదు. నా మాటలు నచ్చిన భీష్ముడు నన్ను ఆ విధంగా పిలిచాడు. ఆ తరవాత నా మీద శ్లోకాలు, పద్యాలు రాసుకున్నవారు అలా పిల్చుకున్నవారు. నన్ను నేను జగద్గురువుని అనుకునేంత అవివేకిని కాను నేను.
 
 9. ఓ పక్కన కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంటే నువ్వు అర్జునుడిని పక్కకు తీసుకెళ్లి ఏడు వందల శ్లోకాల భగవద్గీత బోధించావట కద.
 
 ఓ పక్కన యుద్ధం జరుగుతుంటే, నేను గీతా బోధ చేస్తూ కూర్చుంటే అవతలి పక్షం వారు మా కబుర్లు వింటూ కూర్చోవడానికి వారేమీ చవట దద్దమ్మలు కాదు. నేను రెండే వాక్యాలు చెప్పాను. చంపేది నువ్వు కాదు, చంపించేవాడు వేరు అని. అలా చెబితే అర్జునుడికి అర్థం అయ్యింది. మరి సామాన్యులకు అర్థం కావాలంటె ఎలా. అందుకే వ్యాసభగవానుడు దానికి ఏడువందల శ్లోకాలుగా అందులో చెప్పాడు. అంతే.


 ఇంతవరకు మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు, మీ సందేహాలను నివృత్తి చేసుకున్నారు అందవరకు సంతోషమే. ఇక్కడ నాదొక చిన్న మనవి. దయచేసి నేను చెప్పిన మాటలను యథాతథంగానే మీరు రిపోర్ట చేయండి. అంతేకాని దానికి మీ సొంతవాక్యాలు జతచేసి, అర్థం మారేలా మాత్రం చేయకండని మిమ్మల్నందరినీ ప్రార్థిస్తున్నాను. మళ్లీ మళ్లీ మీకు విన్నవించుకుంటున్నాను. నేను మీలాగే సామాన్యమానవుడినే కాని, మహిమలు చేసేవాడిని మాత్రం కాదు. ఆ విషయాన్ని మరిచిపోవద్దు. ఒక్కసారి నా గురించి వ్యాసమహర్షి భారతంలో చదివితే నేనేమిటో, నా ప్రవర్తనేమిటో మీకు సరిగా అర్థం అవుతుంది. అంతేకాని ఎవరికి తోచిన విధంగా వారు నా మీద వ్యాఖ్యలు చేసినవాటి గురించి నన్ను మీరు ఊహించుకుని ప్రశ్నిస్తే అందుకు నేను సమాధానపరచలేను. వ్యాసుడు నా గురించి ఎవరికి ఎటువంటి సందేహాలు వస్తాయో, వాటిని ఆయనే వేసి, ఆయనే ఎక్కడిక్కకడ సమాధానాలు చెప్పాడు. అది పూర్తిగా ఒంటబట్టించుకోండి. నేనేమిటో అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అందరివాడు, అందరి ఇంటా తిరుగాడేవాడు.
 
 మీరందరూ వచ్చి, నా పుట్టినరోజున నాకు సంబంధించిన సమస్యలను అడిగి, సమాధానాలు తెలుసుకున్నారని భావిస్తాను. నేను చెప్పినదానితో మిమ్మల్ని ఏకీభవించమని చెప్పే చిన్నమనస్కుడిని కాను. నన్ను మీరు ఎలా ఊహించుకోవాలనుకుంటే ఆ విధంగా ఊహించుకోండి. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక ఏనుగు నడుస్తుంటే వంద కుక్కలు మొరుగుతాయి. అందువల్ల ఏనుగుకి వచ్చిన నష్టమేమీ లేదు. ఇది మీకుతెలిసిందే. ఏది ఏమైనా నా పుట్టినరోజునాడు నేనేమిటో ఒకసారి నేను గుర్తుచేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు మరోసారి ధన్యవాదాలు. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, విద్యలు నేర్పిన గురువులందరికీ ఈ సందర్భంగా నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
 
 డా.వైజయంతి
   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement