చాడీలు చెప్పారంటూ మనస్తాపం
* హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య..
* ఆందోళనకు దిగిన కుటుంబీకులు
పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట బీసీ బాలికల హాస్టల్‌లో 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. తనపై అమ్మకు చాడీలు చెప్పడంపై తీవ్ర మనస్తాపానికి గురైన 14 ఏళ్ల బాలిక సూసైడ్‌నోట్ రాసి ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణఖేడ్ మండలం చల్లగిద్ద తండాకు చెందిన కర్ర హరినాయక్, చావ్లీబాయి దంపతులకు ఏడుగురు సంతానం. అందులో ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నకూతురు అరుణ (14) పెద్దశంకరం పేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతూ అక్కడే బాలికల హాస్టల్‌లో ఉంటుంది.
విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏఎన్‌ఎం కమల శనివారం ఉదయం హాస్టల్‌కు వచ్చింది. రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు ఆమె హాస్టల్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. తలుపు తట్టినా ఎవరూ తీయలేదు. ఏఎన్‌ఎంతోపాటు ఆయా కిటికీలో నుంచి లోనికి చూడగా కర్ర అరుణ ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. దీంతో తలుపులు పగులగొట్టి అరుణను కిందికి దించారు. వైద్యాధికారి శంకర్ వచ్చి చూడగా అప్పటికే మరణించినట్టు ధ్రువీకరించారు. అక్కడే రెండు పేజీల సూసైడ్ నోట్ దొరికింది. ‘మౌనిక, భూలక్ష్మి అనే ఇద్దరు నాపై అమ్మకు చాడీలు చెప్పారు.
నేను ఏ తప్పూ చేయలేదు. నన్ను అపార్థం చేసుకున్నారు. నా చావుకు వారిద్దరే కారణం’ అంటూ అరుణ అందులో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్‌కు చేరుకున్నారు. వారు వచ్చి ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరుణ మృతికి కారకులను శిక్షించాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. జోగిపేట ఇన్‌చార్జ్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు మహేష్‌గౌడ్, సత్యనారాయణ, విజయరావు, శేఖర్‌రెడ్డి, తహశీల్దార్ దేశ్యా, రాణా ప్రతాప్‌సింగ్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సువర్ణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని సముదాయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.