మేమింతే..! | biometric mission is not working properly in govt hospital | Sakshi
Sakshi News home page

మేమింతే..!

Published Thu, Aug 24 2017 10:36 AM | Last Updated on Sun, Sep 17 2017 5:55 PM

మేమింతే..!

మేమింతే..!

10కి వస్తాం.. 12కు వెళ్తాం
వైద్యుల కోసం రోగుల ఎదురుచూపులు
పనిచేయని బయోమెట్రిక్‌ మిషన్‌
మారని జిల్లా ఆస్పత్రి వైద్యుల తీరు


ప్రొద్దుటూరు క్రైం: నిత్యం వందలమంది ప్రజలు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వస్తుంటారు.. డాక్టర్‌కు చూపించుకొని త్వరగా ఇంటికి వెళ్దామనుకొని దూరప్రాంతాలకు చెందిన ఎంతోమంది ఉదయాన్నే ఆస్పత్రికి వస్తారు.. పాపం కొందరు రోగులు ఉదయం 8.30, 9గంటల నుంచే ఆస్పత్రి ఓపీ వద్ద పడిగాపులు కాస్తుంటారు. వైద్యులు ఆలస్యంగా విధులకు వస్తుండటంతో ఆస్పత్రిలోనే వారికి మధ్యాహ్నం అవుతోంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ డాక్టర్లు ఇంతే..
ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి స్థానికంగా ఉన్నవారే గాక చుట్టు పక్కల మండలాల నుంచి వైద్యం కోసం వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రిలో సీటిస్కానింగ్, డయాలసిస్‌ విభాగం ఉండటంతో ఓపీ సంఖ్య గతంలో కంటే బాగా పెరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఓపీ నిర్వహించాల్సి ఉంది. తర్వాత 2గంటల వరకు అత్యవసర విభాగం, వార్డులను సందర్శించాలి. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం తిరిగి వార్డుల్లో ఉన్న ఇన్‌పేషంట్లను పరిశీలించి 4 గంటల వరకు డాక్టర్లు ఆస్పత్రిలోనే అందుబాటులో ఉండాలి. డాక్టర్లు ఉదయమే వస్తారనే ఉద్దేశంతో దూరప్రాంతాలకు చెందిన మహిళలు, వృద్ధులు ఉదయాన్నే ఆస్పత్రికి వస్తారు. జిల్లా ఆస్పత్రిలో ఐదుగురు సవిల్‌ సర్జన్‌లు, 12మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌లు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు సగం మందికి బయట ప్రైవేట్‌ క్లినిక్‌లు ఉన్నాయి. దీంతో ఉదయం ఓపీకి రావడం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఉన్నతాధికారులు ఎన్నో సార్లు హెచ్చరించినా వారిలో మార్పు రాలేదు. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం కొన్నిరోజులు సమయపాలన పాటిస్తారు. తర్వాత పరిస్థితి షరామామూలే. కొందరు వైద్యులు ఉదయం 9.30కు రాగా మరి కొందరు 9.45 గంటలకు వస్తున్నారు. మిగతా వారందరూ 10 గంటల తర్వాతనే ఆస్పత్రికి వస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ఓపీ విభాగాల్లో 12 గంటల తర్వాత డాక్టర్లు ఉండటం లేదని రోగులు వాపోతున్నారు. వీరిలో చాలా మంది డాక్టర్లు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి తిరిగి ఆస్పత్రికి రావడం లేదని రోగులు వాపోతున్నారు. డాక్టర్లు ఆలస్యంగా వస్తుండటంతో కొందరు వృద్ధులు క్యూలో నిల్చోలేక అవస్థలు పడుతున్నారు.

బయోమెట్రిక్‌ ఉంది.. కానీ పని చేయదు
జిల్లా ఆస్పత్రిలో నాలుగేళ్ల క్రితమే బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఏ రోజు పట్టుమని పదిరోజులు కూడా మిషన్‌ పనిచేయలేదు. ఆస్పత్రికి ఉదయం 9 గంటలలోపు వచ్చి బయోమెట్రిక్‌ యంత్రంలో వేలిముద్ర ద్వారా హాజరు వేసుకోవాలి. ఇళ్లకు వెళ్లేటప్పుడు కూడా బయోమెట్రిక్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మిషన్‌ ఉంటే 9 గంటల లోపు ఆస్పత్రికి రావాల్సి ఉంటుందనే కారణంతో కొందరు కావాలనే చెడగొడుతున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు.

జిల్లా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సులు, సెక్యూరిటీ, ఏఎన్‌ఎంలు, ల్యాబ్‌ సిబ్బందితో కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం  షిఫ్ట్‌లవారీగా నిర్ణీత సమయానికి విధులకు హాజరు అవుతున్నారు. కానీ కొందరు వైద్యులు, కార్యాలయంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు మాత్రం సమయ పాలన పాటించడం లేదని సిబ్బందే చెబుతున్నారు. బయోమెట్రిక్‌ మిషన్‌ పనిచేస్తే వైద్యులు, ఉద్యోగుల వ్యవహారం గాడిలోకి వచ్చే అవకాశం ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement