‘కట్టలు’ తెంచుకున్న జనాగ్రహం
- బత్తలపల్లి, రొద్దం మండలాల్లో రాస్తారోకో
బత్తలపల్లి /రొద్దం :
కరెన్సీ కష్టాలు తీరకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రంలోనూ, రొద్దం మండలం పెద్దమంతూరు గ్రామంలోనూ ఆందోళనలు నిర్వహించారు. బత్తలపల్లిలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బ్రాంచ్ వద్దకు ఉదయమే వందలాదిమంది ఖాతాదారులు చేరుకున్నారు. బ్యాంకులో నగదు లేకపోవడంతో మేనేజర్ ఉమామహేశ్వర్ వర్దన్ ధర్మవరం, అనంతపురం బ్రాంచ్‌లకు ఫోన్ చేశారు. అక్కడా లేదని సమాధానం వచ్చింది. ఇదే విషయాన్ని ఖాతాదారులకు చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఇదే మాట చెబుతున్నారంటూ బ్యాంకు ఎదుట చెన్నై-ముంబాయి జాతీయ రహదారిపై అరగంట పాటు బైఠాయించారు. ఇరువైపులా వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బ్యాంకు మేనేజర్ వచ్చి తమ సమస్య తీర్చాలంటూ పట్టుబట్టారు. దీంతో ఆయన అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించామని, అనంతపురం నుంచి డబ్బు తెచ్చి కూపన్లు ఉన్నవారికి పంపిణీ చేస్తామని చెప్పారు. మిగిలిన వారికి ఇప్పుడు కూపన్లు ఇచ్చి మరుసటి రోజు నగదు పంపిణీ చేస్తామన్నారు. దీంతో ఆందోళన విరమించారు. అలాగే రొద్దం మండలం పెద్దమంతూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు నగదు లేదని చెప్పడంతో అక్కడే ధర్నాకు దిగారు. ఇంకెన్నాళ్లీ కష్టాలంటూ మండిపడ్డారు. తన కుమారుడికి ఛాతీనొప్పి రావడంతో బెంగళూరులోని ఆస్పత్రికి తరలించామని, రూ.20 వేల నగదు అవసరమై ఇక్కడికొస్తే లేదని చెబుతున్నారని కల్లకుంట గ్రామానికి చెందిన జయప్ప వాపోయారు. రెండు రోజుల్లో కుమార్తె వివాహం ఉందని, బ్యాంకులో డబ్బివ్వకపోవడంతో పెళ్లి ఆగుతుందేమోనన్న భయంతో ఉన్నానని గొబ్బిరంపల్లికి చెందిన గోవిందప్ప ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ మేనేజర్ భాస్కర్ స్పందిస్తూ బుధవారం రూ.5 లక్షలు రావడంతో కొందరు ఖాతాదారులకు ఇచ్చామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.20 లక్షలు వస్తే గానీ అందరికీ సర్దుబాటు చేయలేమన్నారు. చేసేదిలేక ఖాతాదారులు ధర్నా విరమించి..నిరాశతో వెనుదిరిగారు.