ప్రైవేటు టెన్త్ విధానం రద్దు : డీఈవో
ప్రైవేటు టెన్త్ విధానం రద్దు : డీఈవో
Published Thu, Aug 4 2016 7:56 PM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM
ఆకివీడు : ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలు రాసే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని జిల్లా విద్యాశాఖాధికారి దుక్కిపాటి మధుసూదనరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్‌ఆర్‌ఐ సహకారంతో నిర్మించిన భోజన హాలును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి దాతలు నడుంకట్టాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ దాత కంభంపాటి వెంకట లక్ష్మీ నర్శింహం తన తండ్రి ఇదే పాఠశాలలో చదివి, ఇదే పాఠశాలలో పనిచేశారని, తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని చెప్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గుర్తింపు పొందని పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు జిల్లా ఉమ్మడి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 11,836 మంది ఉపాధ్యాయులకు 11,050 మంది సర్వీసులను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని చెప్పారు.
మిగిలిన 785 మంది సర్వీసు రిజిస్టర్లు ఆన్‌లైన్ చేయించుకోకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి వరకూ చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు ఒకే పరీక్షా పత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. పదో తరగతిలో రెండేళ్లపాటు ఇంటర్నల్ మార్కులు 20 శాతం పబ్లిక్ పరీక్షా మార్కుల్లో కలుపుతామని చెప్పారు. ఈ ఏడాది ఎనిమిదో తరగతికి ఐదు శాతం, వచ్చే ఏడాది 9వ తరగతికి 5 శాతం, ఆ పై వచ్చే ఏడాది పదవ తరగతికి పది శాతం ఇంటర్నల్ మార్కులు కలుపుతామని డీఈవో చెప్పారు. అలా మొత్తం 20 శాతం మార్కులు అవుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీవైఈవో మద్దూరి సూర్యనారాయణమూర్తి, ఎంఈఓ సత్యానంద్, సీఎంఓ కె.కృష్ణారావు, హెచ్‌ఎం రాజరాజేశ్వరి, జెడ్పీటీసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఎంపీటీసీ సభ్యులు బొల్లా వెంకట్రావు, యజమాన్య కమిటీ చైర్మన్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement