ఆక్వారంగాన్ని శాసిస్తున్న చైనా
ఆక్వారంగాన్ని శాసిస్తున్న చైనా
Published Sun, Feb 12 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM
భీమవరం : ఆక్వారంగ ఉత్పత్తుల్లో ప్రపంచాన్ని చైనా దేశమే శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 580 రకాల చేపలను ఉత్పత్తి చేస్తుండగా ఒక్క చైనా దేశం 250 రకాలను ఉత్పత్తి చేస్తూ గుర్తింపు తెచ్చుకుందని ఆక్వా శాస్త్రవేత్త డాక్టర్ ఎంవీ గుప్త అన్నారు. భీమవరంలో నిర్వహిస్తున్న ప్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ అంతర్జాతీయ సదస్సులో రెండోరోజు ఆదివారం ఆయన మాట్లాడారు. దేశంలో ఆక్వా ఉత్పత్తులకు అవసరమైన ఎన్నోరకాల వనరులున్నప్పటికీ వాటిని వినియోగించుకోలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మలేషియాకు చెందిన డాక్టర్ నయన్‌తా మాట్లాడుతూ వనామి రొయ్యల సాగులో రైతులు ఏడాదికి మూడు పంటలను తీస్తున్నప్పటికీ ఒక్క పంటలో మాత్రమే లాభాలు వస్తున్నట్టు ఇక్కడ రైతులు చెబుతున్నారని అయితే బయోక్లిక్ టెక్నాలజీ ద్వారా అధిక ఉత్పత్తులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉందన్నారు. తైవాన్‌కు చెందిన ఇహు చైన్ మాట్లాడుతూ తమ దేశంలో నీటి యాజమాన్య పద్ధతులు సక్రమంగా అవలంభిస్తారని అందువల్లనే అక్కడి రైతులు ఆక్వా సాగులో లాభాలు పొందుతున్నారన్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన మహిడోల్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ బూన్‌ప్రిమ్ విత్యాసుమనరన్‌కుల్ మాట్లాడుతూ వనామీ రొయ్యల సాగులో సీడ్ దశ నుంచి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన వీరాసన్ ప్రేమోతమొరన్‌కుల్ మాట్లాడుతూ ఆక్వా సాగులో డైనమిక్స్ ప్రొటోకాల్ పాటించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ ఆక్వా రైతులంతా సమైక్యంగా ఉంటూ అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దిగుబడులు సాధించిన 19 మంది రైతులకు జ్ఞాపికలను అందించారు. ఈ సదస్సులో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement