ఖైదీ చేతికి తుపాకి
వైఎస్సార్ జిల్లా: కడప పోలీసుల బాధ్యతారహిత్యం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దొంగల నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దొంగ చేతికి తాళాలిచ్చిన చందాన వ్యవహరించారు. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు తమ తుపాకిని ఖైదీకి అప్పగించిన ఘటన తిరుపతిలో శనివారం జరిగింది. పోలీసుల పనితీరుపై ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..... కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా ఖైదీని వైద్య పరీక్షల నిమిత్తం శనివారం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె వెంట ఏఆర్ కానిస్టేబుల్ నాయక్‌తో పాటు మరో మహిళా పోలీస్ అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు వైద్య చికిత్సలు చేయించిన అనంతరం పనిమీద బయటకు వెళ్తున్న ఇద్దరు పోలీసులు ఖైదీ చేతికి తుపాకి ఇచ్చి బయటకు వెళ్లారు.
అలాంటి సమయంలో ఖైదీ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి పరారయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇది గమనించిన ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అరగంట తర్వాత వచ్చిన పోలీసులు ఖైదీని అక్కడి నుంచి రిమాండ్‌కు తరలించారు. దీనికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.