రెండు ఆటోలు ఢీ.. నలుగురికి గాయాలు
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని నందిపల్లె ఎస్సీ కాలనీ వద్ద ఆదివారం సాయంత్రం రెండు ఆటోలు ఢీ కొన్న సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కొంత మంది భక్తులు ఆదివారం ఆటోలో బ్రహ్మంగారిని దర్శించుకుని నందిపల్లె మీదుగా మైదుకూరు బయలుదేరారు. మార్గమధ్యంలో బద్వేలు నుంచి పెద్దరాజుపల్లెకు వస్తున్న మరో ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి రెండు కాళ్లు విరగగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆటోలు ఢీ కొనగానే, స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రంగస్వామి తెలిపారు.