పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లి అరెస్ట్ చేసిన ఎస్‌ఐ
సంగారెడ్డి క్రైం/నర్సాపూర్: వరకట్నం కేసులో నిందితుడిగా ఉన్న ఓ కానిస్టేబుల్‌ను ఎస్‌ఐ నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదుపులోకి తీసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. రామచంద్రాపురానికి చెందిన ఉమారాణికి సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్‌కు చెందిన ప్రభుతో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త ప్రభుతో పాటు అత్తామామలు, ఆడబిడ్డలు వరకట్న వేధింపులకు పాల్పడగా ఉమారాణి ఇటీవల ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఉమారాణి మృతికి భర్త, అత్తామామలతో పాటు ఆడబిడ్డ వరలక్ష్మి, ఆమె భర్త నారాయణలే కారణమంటూ మృతురాలి సోదరుడు జీతయ్య ఇంద్రకరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసులో నిందితుడిగా ఉన్న నారాయణ నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
ఇతన్ని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు రావాలని పలుమార్లు సూచించినా రాకపోవడంతో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించగా నారాయణ సహకరించలేదు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో తోపులాట జరిగింది. ఎస్‌ఐ ఇతర సిబ్బంది నారాయణను బలవంతంగా జీపులో ఎక్కించుకుని అరెస్ట్ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నారాయణ భార్య
ఇంద్రకరణ్ పోలీసులు తన భర్త నారాయణను అనవసరంగా అరెస్టు చేశారని అతని భార్య వరలక్ష్మి ఆరోపించింది. వరలక్ష్మి బుధవారం నర్సాపూర్ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన భర్త విధుల్లో ఉండగా అరెస్టు చేసి తీసుకుపోవడం ఎంత వరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. కాగా తమ అన్న కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
పై అధికారులకు విన్నవిస్తా..
కానిస్టేబుల్ నారాయణను పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి అరెస్టు చేసి తీసుకువెళ్లిన తీరును పై అధికారులకు విన్నవిస్తానని స్థానిక ఎస్‌ఐ గోపీనాథ్ చెప్పారు. అతను విధుల్లో ఉండగా తీసుకుపోయారన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రిమాండ్
వరకట్నం, హత్య కేసులో నిందితులుగా ఉన్న ప్రభు, నారాయణలను ఉన్నతాధికారుల ఆదేశం మేరకే బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న తెలిపారు. ఇంద్ర కరణ్‌లో ఉమారాణి ఆత్మహత్యకు ఆమె భర్త ప్రభు, బావ నారాయణలు కారణమంటూ మృతురాలి సోదరుడు జీతయ్య ఫిర్యాదు చేశారన్నారు. కేసులో నిందితులిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.