దమ్ముంటే జిల్లా బహిష్కరణ చెయ్!
దమ్ముంటే జిల్లా బహిష్కరణ చెయ్!
Published Tue, Jan 17 2017 9:42 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
జిల్లా.. నీ అబ్బ జాగీరనుకున్నావా?
– పెట్టుబడి దారుల బ్రోకర్ నీవు
– హైకోర్టు, సీఎస్ ఆదేశాలను పాటించవా?
– రైతులకు న్యాయం చేయమంటే అభివృద్ధి నిరోధకులు అంటావా?
– జిల్లా కలెక్టర్‌కు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ సవాల్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు దమ్మూ, ధైర్యం ఉంటే సీపీఎం పార్టీ నాయకులను జిల్లా బహిష్కరణ చేయాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ సవాల్ విసిరారు. మంగళవారం నగరంలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకరరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా నీ అబ్బ జాగీరా.. పెట్టుబడి దారుల బ్రోకర్ నీవు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లాలో దుర్మార్గమైన పాలన సాగుతోందని, ప్రజలకు న్యాయం చేయాల్సిన కలెక్టరే రాజకీయ పార్టీ ఏజెంట్‌గా మారితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ చూసుకొని హైకోర్టు, చీఫ్ సెక్రటరీ మాటలను సైతం కలెక్టర్ పట్టించుకోవడం లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గని, శకునాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ కోసం జిల్లా అధికారులు బలవంతంగా రైతుల పొలాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కొందరు రైతులు రెండు బృందాలుగా హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కోను పొందారని తెలిపారు. కొన్నేళ్లుగా భూమి సాగు చేసుకుంటూ డీ పట్టాలు పొందిన రైతులకు పరిహారం అందించకుండా హైకోర్టు తీర్పును సైతం ధిక్కరించి ముందుకు వెళ్తుండడంతో సోమవారం సీపీఎం నాయకులు ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కమ్యూనిస్టు పార్టీలు అభివృద్ధి నిరోధక పార్టీలని, వారిని జిల్లా బహిష్కరణ చేయాలని వ్యాఖ్యానించారు. కలెక్టర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం సీపీఎం నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఇదే రైతుల నష్టపరిహారం విషయంలో చీఫ్ సెక్రటరీ ఆదేశాలను సైతం కలెక్టర్ ధిక్కరిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు పరిహారం చెల్లించి సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే ఎలాంటి అవరోధం లేదని, కావాలనే జిల్లా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సోలార్ ప్రాజెక్టులతో స్థానికులకు వాచ్‌మెన్ జాబులే వస్తాయని, ఉపాధినిచ్చే పరిశ్రమల స్థాపనలో జిల్లా కలెక్టర్ విఫలమయ్యారన్నారు. కాగా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసి మూడేళ్లవుతున్నా దాని గురించి పట్టించుకోవడం లేదని, ఆ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రారంభిస్తే దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
Advertisement
Advertisement