ఎక్స్‌లెంట్ చీటింగ్... రూ.20 కోట్లకు పైగా స్వాహా
హైదరాబాద్: ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఆర్బిట్ సొల్యూషన్స్ పేరుతో సంస్థలు ఏర్పాటు చేసి రూ.20 కోట్ల మేర మోసం చేసిన ఘరానా నిందితుడిని విచారించిన సీసీఎస్ పోలీసులు కీలకాధారాలు సేకరించారు. ముగ్గురు వ్యక్తుల బారినపడి మోసపోయిన వారిలో ప్రవాస భారతీయులు సైతం ఉన్నారని డీసీపీ అవినాష్ మహంతి ఆదివారం వెల్లడించారు. మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్షాద్ మహ్మద్ తన స్నేహితుడైన కె.రవికిరణ్‌తో కలిసి యూసుఫ్‌గూడ ప్రాంతంలో ఎక్స్‌లెంట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పేరుతో, తన భార్య హిమబిందు శివాంగితో కలిసి మాసబ్‌ట్యాంక్‌లో ఆర్బిట్ సొల్యూషన్స్ పేరిట సంస్థలు ఏర్పాటు చేశారు.
తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితో రెండు నెలల్లోనే 30 నుంచి 35 శాతం లాభాలు ఇస్తామంటూ నమ్మబలికాడు. బంధువులు, స్నేహితులతో పాటు ప్రవాస భారతీయుల్నీ ఆకర్షించిన ఇతగాడు 2013 అక్టోబర్ నుంచి 2016 ఫిబ్రవరి మధ్య రూ.20 కోట్లకు పైగా పెట్టుబడులు స్వీకరించాడు. తొలుత రెండు నెలల పాటు కొంత మేర లాభాలు పంచిన ఈ త్రయం ఆపై చేతులెత్తేసింది. ఈ ముగ్గురూ ఓ రెస్టారెంట్‌తో పాటు ఏడు సంస్థల్ని ఏర్పాటు చేసి నిధుల్ని వాటిలోకి మళ్ళించారు. మరోపక్క పెట్టుబడిగా వచ్చిన సొమ్ముతో స్థిరచరాస్తులు, ఖరీదైన కార్లు కొనుగోలు చేయడంతో పాటు విదేశాలకు టూర్లు వెళ్లి వచ్చేవారు. వీరి వద్ద రూ.8.05 కోట్లు పెట్టుబడిపెట్టిన మహ్మద్ అఫ్రొజ్, మహ్మద్ ఇమ్రోజ్, మహ్మద్ రఫీలు ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది.
ఈ విషయం తెలుసుకున్న ఇర్షాద్ ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియా పారిపోయాడు. కొన్ని రోజులు అక్కడ ఉండగా... స్నేహితులు గుర్తించడంతో గత్యంతరం లేక గత నెలలో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో గత సోమవారం కోర్టులో లొంగిపోయాడు. న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు ఇర్షాద్‌ను మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించాయి. ఇతడు పేర్కొన్న అంశాల ఆధారంగా నేర నిరూపణకు అవసరమైన 34 కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.