తిరుపతి హెడ్‌పోస్టాఫీస్ వద్ద ధర్నా చేస్తున్న జీడీఎస్ ఉద్యోగులు
తిరుపతి అర్బన్: తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమైనట్లు ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ సర్కిల్(రాష్ట్ర) ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ.శివరామిరెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతిలోని హెడ్ పోస్టాఫీస్ ఆవరణలో గల పోస్టల్ డివిజన్ కార్యాలయం వద్ద జీడీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, పుత్తూరు, నగరి, రేణిగుంట, తిరుపతి, తిరుమల, చంద్రగిరి, పాకాల, పీలేరు, వాల్మీకిపురం, కలకడ మండలాలకు చెందిన వందలాది మంది జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. యూనియన్ కార్యదర్శి నాగయ్య, కోశాధికారి కళా వెంకట్రావు, హెడ్ ఆఫీస్ కార్యదర్శి కమల్ కణ్ణన్, శ్రీకాళహస్తి బ్రాంచ్ అధ్యక్షుడు సత్యనారాయణ, నగరి బ్రాంచ్ అధ్యక్షుడు ఎంజీ మణి, పీలేరు బ్రాంచ్ అధ్యక్షుడు రామిరెడ్డి పాల్గొన్నారు.