తొలిరోజు పుష్కరం మమ
తొలిరోజు పుష్కరం మమ
Published Sat, Aug 13 2016 6:43 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
* పెనుమూడి పుష్కర ఘాట్‌కు చేరని జలాలు
* నామమాత్రంగా భక్తుల సందడి
* సముద్రపు పోటు నీటిని పైపుల ద్వారా..
అందించిన అధికారులు
మోర్తోట (నిజాంపట్నం), రేపల్లె: కృష్ణమ్మ పుష్కరాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.. తొలిరోజు భక్తుల సందడి నామమాత్రంగానే కనిపించటంతో పుష్కర ఘాట్‌లు వెలవెలపోయాయి. కృష్ణమ్మ పుష్కరాల సందర్భంగా ఆతల్లి ఒడిలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు హరించి, సుఖశాంతులు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు కృష్ణమ్మ జాడలేకపోవటంతో నిరుత్సోహాన్ని మిగిల్చింది. పెనుమూడి ఘాట్, మండలంలో రావిఅనంతవరం, పెనుమూడి వీఐపీ ఘాట్, మోర్తోట, మైనేనివారిపాలెం, గంగడిపాలెం, రాజుకాల్వల్లో పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేశారు. అయితే నదిలో నీటి కొరత ఏర్పడింది.
ఘాట్ ఇనుప కంచె తొలగించి..
ఘాట్‌కు ఏర్పాటు చేసిన ఇనుమ కంచెను తొలగించిన కొద్ది దూరంలో పడవలు ఏర్పాటు చేసి స్నానాలకు ఏర్పాటు చేయటంతో పాటు పైపులైన్ల ద్వారా స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో భక్తులు ఆనీటితోనే స్నానాలు చేసి సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. దక్షిణ కాశీగా పేరుగాంచి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మోర్తోట ముక్తేశ్వరుని ఆలయం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించి ముక్తిని పొందవచ్చని వచ్చిన భక్తులు ముక్తి మాట దేవుడెరుగు పుణ్యస్నానాలకు నీరే కరువు అంటూ ఏకరువుపెట్టారు. సముద్రపు జలాలల్లోనే పుణ్యస్నానాలు చేసి సంతృప్తి పొందాల్సి వచ్చింది. మండలంలోని పెనుమూడి, మోర్తోట తదితర పుష్కర ఘాట్‌లలో భక్తుల సందడి నామమాత్రంగానే కనిపించింది.
మోర్తోటలో పుణ్యస్నానాలు..
రేపల్లె మండలం మోర్తోట గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి దేవాలయ సమీపంలోని కృష్ణా పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఘాట్‌కు ఉదయం 7.30గంటల వరకు సముద్రపు పోటునీరు తాకిడి ఉండటంతో అరకొరగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. 7.30గంటల నుంచి సముద్రపు పాటు మళ్ళటంతో ఘాట్ దరికి నీరు చేరకపోవటంతో వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించకుండా వేచి చూడాల్సి వచ్చింది. అయితే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నీరు లేకపోవటంతో కొందరు వెనుతిరిగి వెళ్లిపోయారు.
ఘాట్ వద్ద నీరులేకపోవడంతో..
11.30 గంటల తరువాత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పుష్కరఘాట్‌కు పక్కనే నదిలో స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శాస్త్రోక్తంగా పిండ ప్రధానాలు నిర్వహించుకున్నారు. ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.
బక్కెట్లతో నీళ్లు..
నదిలోని నీటిని గజ ఈతగాళ్ళ దగ్గర నుంచి బకెట్లతో తెప్పించుకుని మగ్గులతో నెత్తిపై పోసుకోవాల్సిన పరిస్థితి. వచ్చిన భక్తులు నీరులేకపోవటంతో నిరాశకుగురై ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్లలేక నెత్తిపై కొంచెం నీరు చిమ్ముకుని మమ అనుకున్నారు. నీరు వచ్చే విధంగా ఘాట్‌లు నిర్మించకపోవటంతో వచ్చిన భక్తులు ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. ముందుగానే భక్తులు తమ వెంట బక్కెట్టు, మగ్గు తెచ్చుకోవాలని ప్రకటన ఇచ్చి ఉంటే బాగుండేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement