ఒంటిపూట లేనట్లే..!
► అకడమిక్ క్యాలెండర్‌లో ఫుల్‌టైం నిర్వహణకు ఆదేశం
► నిర్ణయం సరికాదంటున్నఉపాధ్యాయులు
► ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటున్న అధికారులు
సిరిసిల్ల ఎడ్యుకేషన్ : పాఠశాలలకు ఏటా వేసవిసెలవులు ప్రకటించడం పరిపాటి. ఆ ఆనవాయితీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముగింపు పలికింది. ఒంటిపూట సెలవును రద్దు చేసి మార్చి నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. 2017–18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచే ప్రారంభించాలని ఈనెల రెండున హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు, విధివిధానాలు ఖరారు చేశారు.
ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత
ఎండకాలంలోనూ రెండుపూటల బడి ఉంటుందన్న ప్రభుత్వ నిబంధనను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయని, పెద్దలు సైతం ఇంట్లో సేదతీరుతున్నారని, ఇక పిల్లలు ఎలా బడికి వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గతంలో వెనక్కి తగ్గిన సర్కారు
గతేడాది ఒంటిపూట బడికి అవకాశం లేదంటూ ఎస్‌ఇఆర్‌టీ నిర్ణయాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెల్సిందే. సర్కారు ఆదేశాలతో ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినా విద్యార్థుల హాజరు తగ్గిపోయింది. దీంతో ఉన్నతాధికారులు మళ్లీ ఒంటిపూట బడిని కొనసాగించారు. ఈ క్రమంలో ఎప్పటిమాదిరిగానే ఒంటిపూట బడి కొనసాగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
నూతన విద్యాసంవత్సరం పనివేళలివే..
ఫిబ్రవరి 2 తేదీన హైదరాబాద్‌లోని ఎస్‌సిఇఆర్‌టీలో విద్యాశాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. 2017–18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహించాలని నిర్ణయించా రు. దీనిలో ప్రైమరీ, అప్సర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల నిర్వహణ సమయాలను ప్రస్తుత పనివేళలనే పాటించాలని తెలిపారు. దీని ఆధారంగా ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9 నుంచి 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలకు 9.30 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిర్వహించేలా సమయసారిణి ఉంది. దీనిని అమలు చేయడం కష్టమని ఉపాధ్యాయులు ఇప్పటికే చర్చించకుంటున్నారు.
వేళల మార్పు మా పరిధి కాదు
పాఠశాలల పనివేళలు నిర్ణయం రాష్ట్రస్థాయిలో జరుగుతోంది. దీనిని అమలు పరచడంలో ఏదేని సమస్యలు వస్తే దానిని ఉన్నతాధికారులకు వివరిస్తాం. వారి ఆదేశానుసారం ముందుకు సాగుతాం. – రాధాకిషన్, డీఈవో
గత అనుభవాలు తెలుసుకోవాలి
వేసవిలో రెండుపూటల బడి సరైన నిర్ణయం కాదు. గత విద్యాసంవత్సరం ఇలాగే చేశారు. కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి విమర్శలు వచ్చాయి. అప్పుడు సెలవు ఇచ్చారు. మళ్లీ అదే దారి లో వెళ్లడం సరికాదు. – బి.నారాయణ, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి
వడదెబ్బకు బలవుతారు
ఫిబ్రవరిలోనే ఎండలు అధిమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థులు తరగతులకు రావాలంటేనే భయపడతారు. వాళ్లు ఇంటికెళ్లేవరకు భయమే. వడదెబ్బ తగిలితే బలయ్యేది ఉపాధ్యాయులే. దీనిని ఆలోచన చేయాలి. – ఏ.సుధాకర్, ఉపాధ్యాయుడు