ఉద్యోగుల విభజనపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్య పరిష్కారంలో కేంద్రం ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల సమస్యకు కేంద్రమే పరిష్కారం చూపాలంటూ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణ నాటికి సమస్య పరిష్కారానికి నిర్ధిష్ట ప్రతిపాదనలతో తమ ముందుకు రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఏ శంకర్‌నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను, సాదానుగుణంగా తయారు చేసిన తుది జాబితాను సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు, ఏపీ ట్రాన్స్‌కో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను జస్టిస్‌సుభాష్‌రెడ్డి నేతృత్వంలోనే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్ బి నారాయణరెడ్డి వాదనలు వినిపిస్తూ సమస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై కమిటీని ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ ఉద్యోగుల విభజనపై కమిటీ ఎందుకు ఏర్పాటు చేయరని ప్రశ్నించింది. సమస్యకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓ పరిష్కారం చూడాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి నిర్దిష్టమైన ప్రతిపాదనలతో తమ ముందు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.