నేడే ఆరంభం | Implementing new items and services taxes from today | Sakshi
Sakshi News home page

నేడే ఆరంభం

Published Sat, Jul 1 2017 1:53 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

నేడే ఆరంభం

నేడే ఆరంభం

నేటి నుంచి కొత్త వస్తు, సేవల పన్నులు అమలు పెరగనున్న రైస్, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్ల ధరలు అదే బాటలో టి.వి.లు, వాషింగ్‌మిషన్లు, ఫ్రిజ్‌లు ఔషధాలు, వ్యవసాయ పనిముట్లపై భారం తగ్గనున్న నిత్యవసర సరుకుల ధరలు, కార్ల ధరలు అదే బాటలో దుస్తులు, సిమెంట్‌ ధరలు ఇప్పటికీ పన్నులపై స్పష్టత కరువు ఆందోళనలో వ్యాపార, ఉద్యోగ, సామాన్య వర్గాలు

ఒంగోలు: కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం నేటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీఎస్‌టీ అమలును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ అమలుపై ప్రజల నుంచి భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వ్యాపార వర్గాలతో పాటు మిగిలిన మరికొన్ని వర్గాలు జీఎస్‌టీ వల్ల తీవ్రంగా నష్టపోతామని వాదిస్తుండగా.. పాలక పక్షం మాత్రం సామాన్యులపై భారం పడబోదని చెబుతోంది. మొత్తంగా జీఎస్‌టీ అమలుపై మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఏ వస్తువులపై ఎంత శాతం పన్ను ఉంటుంది. ధరలు తగ్గనున్న వస్తువులేవీ, పెరగనున్న వస్తువులేవీ అన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవం అన్ని వర్గాలనూ ఆందోళనకు గురి చేస్తోంది.

జీఎస్‌టీ ప్రభావంతో వర్గాలకు అవసరమైన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గనున్నాయని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. దేశమంతటా ఒకే పన్ను విధానం తీసుకురావడంతో వ్యాపారులు రకరకాల పన్నుల పేరు చెప్పి వినియోగదారులను మోసం చేసే అవకాశం లేకుండా పోయింది. నిత్యవసరాలను పన్ను నుంచి మినహాయించడంతోపాటు మరికొన్నింటిని కనిష్ట పన్ను రేటు 5 శాతం శ్లాబులోనే ఉంచారు. దీంతో 332 సరుకులకు పన్ను లేకుండా కనిష్ట పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. జీఎస్‌టీ వల్ల 115 వస్తువుల ధరలు తగ్గనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వస్తు సేవల పన్నుతో వినియోగదారులకు ఎలాంటి    ప్రయోజనాలు దక్కుతాయోనన్న దానిపై స్పష్టత లేదు. జీఎస్‌టీతో చిన్న వ్యాపారులకు పన్ను బాధ తప్పనుందన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వార్షిక టర్నోవర్‌ 7.5 లక్షలు దాటిన వారంతా వ్యాట్‌ పరిధిలోకి వచ్చేవారు. జీఎస్‌టీలో ఈ పరిమితిని 20 లక్షలకు పెంచారు. ఈ లెక్కన వ్యాట్‌ పరిధిలో ఉన్న వారి సంఖ్య గణనీయంగా తగ్గనుంది.

వ్యవసాయ పనిముట్లపై భారం..
దేశంలో 55 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయ రంగం జీఎస్‌టీ వల్ల మరింత నష్టపోతుందన్న వాదన వినిపిస్తోంది. సేద్యానికి అవసరమైన పనిముట్లు జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చారు. ట్రాక్టర్‌ విడి భాగాలపై తొలుత 28 శాతం పన్ను విధించి విమర్శలు వెల్లువెత్తడంతో దీనిని  18 శాతానికి తగ్గించారు. మొత్తంగా ఇప్పటి వరకు ఎలాంటి డ్యూటీ లేని ట్రాక్టర్, ఇతర పనిముట్లపై 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిఎస్‌టితో వ్యాపారులు, ట్రేడర్లు, వాణిజ్య, సెంట్రల్‌ ఎక్సైజ్, అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌ ద్వారానే లావాదేవీలు నడపవచ్చు. పన్ను రూ.10 వేలు దాటితే నగదు రూపంలో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి.

ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు పై పైకి..
బ్రాండెడ్‌ రైస్‌ జీఎస్‌టీ తర్వాత 5 శాతం పెరగనుంది. (10 కేజీల రైస్‌ బ్యాగుకు రూ.25 పన్ను పెరగనుంది), సిమ్‌కార్డులు, రీచార్జ్‌ కార్డులపై పన్ను రేట్లు 15 నుంచి 18 శాతానికి పెరగనున్నాయి. నెయ్యి 5 శాతం నుంచి 12 శాతానికి పెరగనుంది. మొబైల్‌ ఫోన్లు 6 శాతం నుంచి 12 శాతానికి, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు 6 నుంచి 18 శాతానికి పెరగనున్నాయి. ఆయుర్వేదం మందులు 10 నుంచి 12 శాతానికి, బ్రాండెడ్‌ న్యూడిల్స్, కూల్‌డ్రింక్స్‌ ఒక శాతం పెరగనున్నా యి. టి.వి.లు, వాషింగ్‌ మిషన్లు, ఫ్రిజ్, మైక్రోఓవెన్లు 26 నుండి 28 శాతానికి పెరగనున్నాయి.

ఔషధాలు మరింత ప్రియం..
జీఎస్‌టీతో కొన్ని ఔషధాల ధరలు పెద్ద ఎత్తున పెరగనుండగా మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా డ్రగ్స్‌ అండ్‌ మెడిసిన్, ఇన్సులిన్‌ ఇంజక్షన్ల ధరలు 11 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుండగా, వైద్యపరీక్షల కిట్లు 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గనున్నాయి. సర్జరికల్‌ ఇంప్లాంట్స్,  కంటి లెన్స్‌లు 17.5 శాతం నుంచి 12 శాతానికి తగ్గనున్నాయి. ఇప్పటి వరకు ఔషధాలపై 5 శాతం పన్ను మాత్రమే ఉండగా ఇకపై 12 నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి వస్తుంది. ఉదాహరణకు బి కాంప్లెక్స్, మల్టీ విటమన్, జింకోవిక్‌ లాంటి విటమిన్‌ టాబ్లెట్లు, యాంటీబయోటిక్స్‌ మందులన్నీ 12 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. సెరెలాక్, పెడిన్యూర్‌ వంటి ప్రోటీన్‌ (చిన్నపిల్లలకు ఇచ్చే ఆహారం) 18 శాతం పన్ను పరిధిలోకి వస్తున్నాయి. పొగాకు, బొగ్గు తదితర ఉత్పత్తులపైనా ప్రత్యేక పన్నులు విధించారు. మొత్తంగా జీఎస్‌టీ కొందరికి మోదం.. ఖేదం మిగిల్చింది.

నిత్యావసరాలు అందుబాటులోకి..
జీఎస్‌టీ ప్రభావంతో కొన్ని నిత్యవసరల ధరలు మరింతగా తగ్గనున్నాయి. పౌడర్‌ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. కాఫీ పౌడర్‌ 29 నుంచి 18 శాతానికి, చక్కెర 10 నుంచి 5 శాతానికి తగ్గనుంది. వెన్న 14.5 నుంచి 12 శాతానికి, హెయిర్‌ఆయిల్‌ 29 నుంచి 18 శాతానికి, టూత్‌పేస్ట్, సబ్బులు 29 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. చాక్లెట్లు, బిస్కెట్లు 29 నుంచి 18 శాతానికి, బర్త్‌డే కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు ఇంతే శాతంలో తగ్గనున్నాయి. ఫర్నీచర్‌ 29 నుంచి 12 శాతానికి తగ్గనుండగా, పిజ్జా, బర్గర్లు 3 శాతం తగ్గనున్నాయి.

తగ్గేవి ఇవీ...
చెప్పులు, బూట్లు ధరల్లోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రూ.1000 పైన కొంటే ప్రస్తుతమున్న 26.5 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. రూ.500 నుంచి రూ.1,000 మధ్యన కొనుగోలు చేసే వాటిపై 20.5 నుంచి 18 శాతానికి తగ్గనున్నాయి. రెడీమేడ్‌ దుస్తుల్లో రూ.1,000 పైన కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఉన్న 12.5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గనున్నాయి. రూ.1,000 లోపు కొనుగోలు చేస్తే ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గుతాయి. వైద్య పరికరాలు 18 శాతం నుంచి 12 శాతానికి, సిమెంట్‌ 29 నుంచి 28 శాతానికి తగ్గనున్నాయి. పెద్ద వాహనాలు 30 శాతం నుంచి 28 శాతానికి తగ్గనున్నాయి. ఎస్‌యూబీ కార్ల ధరలు 55 నుంచి 43 శాతానికి తగ్గనుండగా, లగ్జరీ కార్లు 49 శాతం నుంచి 43 శాతానికి, చిన్న కార్లు, బైక్‌లు 30 నుంచి 28 శాతానికి తగ్గుతాయి.     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement