అగ్రగామి రాష్ట్రమే నా లక్ష్యం..
అందుకు అందరూ సంకల్పం చేపట్టాలి
- కడప మహాసంకల్ప సభలో సీఎం చంద్రబాబు
- ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ లక్ష్యం
- 1.5 లక్షలమంది అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమా
సాక్షి ప్రతినిధి, కడప: ‘అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారు. అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన చేపట్టి ఆస్తులు తెలంగాణకు కట్టబెట్టారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రజలు నమ్మకంతో అండగా నిలిచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆమేరకే నవ నిర్మాణ దీక్షను చేపట్టాను. కలెక్టర్ల నేతృత్వంలో అర్థవంతంగా చర్చ సాగింది. రాష్ట్రాభ్యున్నతికి భవిష్యత్ కార్యాచరణపై సంకల్పం తీసుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం కడప మున్సిపల్ గ్రౌండ్‌లో నవనిర్మాణదీక్ష ముగింపులో భాగంగా నిర్వహించిన మహాసంకల్పంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘ప్రగతి పథంలో 2 సంవత్సరాలు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సీఎం స్వయంగా మహాసంకల్పం ప్రతిజ్ఞ చదివి ప్రజానీకంతో చేయించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విభజనలో అన్యాయం జరిగినా సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ రంగంలో విజయం సాధించామని తెలిపారు. ఏడాదిలో తొలివిడతగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా పంపుసెట్లు సరఫరా చేస్తామన్నారు.
అమిత్‌షా కోరిక మేరకే ఎంపీ సీటు
కేంద్రప్రభుత్వ సహకారం రాష్ట్రానికి అవసరమని, ఆమేరకే బీజేపీతో చెలిమి చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కోరిక మేరకే రాజ్యసభ స్థానమిచ్చినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటుబడ్జెట్‌లో ఉందని, కేంద్రం రూ.2,800 కోట్లు మాత్రమే కేటాయించిందని వాపోయారు. ప్రత్యేకహోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోయినా ఇబ్బందేనని, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం రూ.850 కోట్లు కేటాయిస్తే అదనంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘ఇక్కడ ఒక మహానాయకుడు మాట్లాడుతున్నారు.. నరేంద్రమోదీని చూసి భయపడుతున్నానంట.. నేనెందుకు భయపడాలి, ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు నా సహచరుడు. ఆయనంటే నాకెందుకు భయం, నిప్పులా బతికాను.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. చనిపోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికీ రూ.5 లక్షలు చెల్లించేలా ఆగస్టు 15 నుంచి అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక బీమాను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. ఉద్యోగులు సమైక్య రాష్ట్రం కోసం పెద్దఎత్తున ఉద్యమాలు చేసిన నేపథ్యంలో 80 రోజులు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చామన్నారు. రాబోయే ఏడాదిలో 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
వచ్చే ఏడాదికల్లా ఇంటింటికీ వంట గ్యాస్
సాక్షి, విజయవాడ బ్యూరో: రెండేళ్ల పాలనలో ప్రతి గ్రామానికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, అలాగే వచ్చే ఏడాది కల్లా ఇంటింటికీ వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బుధవారం మహాసంకల్పం సందర్భంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి ఇంటికి తాగునీరు, కరెంటు, వంటగ్యాస్, మంచినీటి కొళాయి, కేబుల్ కనెక్షన్లు, ప్రతి పొలానికి సాగునీరు ఇవ్వాలనే లక్ష్యమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పేదల ఉన్నతే లక్ష్యంగా ఇంటింటి సర్వే
కులమతాలతో నిమిత్తం లేకుండా పేదల ఉన్నతి కోసం జూన్ 20 నుంచి ఇంటింటి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువత ఆశలను వమ్ము చేయకుండా ‘బాబు వస్తే జాబు వస్తోంది’ అనే నమ్మకం కోసం రూ.4.70 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులను తీసుకువస్తున్నట్లు తెలిపారు. మైనార్టీలకు రూ.650 కోట్లు కేటాయించామని, రాబోవు 9 నెలల్లో కడపలో హజ్‌హౌస్ నిర్మిస్తామన్నారు.