రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి
Published Sat, Mar 25 2017 1:36 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
భీమడోలు : పూళ్ల ఇందిరమ్మకాలనీ శివారు పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రెండు లారీలు ఢీ కొన్న ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారిలో డివైడర్‌పై వేసిన మొక్కలకు ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన ట్యాంకర్‌తో సిబ్బంది నీరు పోస్తున్నారు. ట్యాంకర్‌ను డివైడర్ పక్కగా ఆపి మొక్కలకు నీటిని పెడుతున్నారు. ట్యాంకర్ సిబ్బంది ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. రాజమండ్రి నుంచి విజయవైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ దూరంగా గోదావరి కాల్వ వైపునకు దూసుకెళ్లింది. ఢీ కొట్టిన లారీ ముందుభాగం నుజ్జైంది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం పెదఎరుకపాడుకు చెందిన డ్రైవర్ మారుబోయిన వెంకటేశ్వరరావు (50) లారీ క్యాబిన్ ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశాడు. ఘటనా స్థలానికి ఎస్సై బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు హుటాహుటిన చేరుకుని డ్రైవర్‌ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. అదే లారీలోని క్లీనర్ సైద్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ట్యాంకర్ లారీ డ్రైవర్ మెడవరపు సత్యనారాయణ మొక్కలకు నీరు పోస్తుండగా లారీ తగలడంతో గాయపడ్డాడు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భీమడోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement