Published
Mon, Aug 29 2016 1:26 AM
| Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి..
కవిటం (పోడూరు): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కవిటం వద్ద పాలకొల్లు–మార్టేరు రహదారిపై ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కావడి వెంకటేశ్వరరావు(50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు బెత్లహోమ్‌పేటకు చెందిన కావడి వెంకటేశ్వరరావు చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నరసాపురం ప్రధాన కాలువలో చేపల వేటకు కవిటం ప్రాంతానికి వెళ్లాడు. ఉదయం అక్కడ చేపలు వేటాడి మధ్యాహ్నం సమయంలో ఎఫ్‌సీఐ గోడౌన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొల్లు వైపు మెటల్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టి పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. ఎస్సై డి.ఆదినారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.