వీడిన హత్య మిస్టరీ | murder case mistory clear | Sakshi
Sakshi News home page

వీడిన హత్య మిస్టరీ

Published Fri, Sep 22 2017 10:26 PM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM

వీడిన హత్య మిస్టరీ - Sakshi

వీడిన హత్య మిస్టరీ

జీపుడ్రైవర్‌ హత్యలో భార్యే కుట్రదారు
ప్రియుడితో కలిసి మట్టుబెట్టిన వైనం
కాల్‌ డేటాతో నిందితుల గుట్టురట్టు
ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు


గుత్తి: కలకలం రేపిన జీపు డ్రైవర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. భార్యే ప్రధాన నిందితురాలని పోలీసుల విచారణలో తేలింది. ప్రియుడితో కొనసాగుతున్న వివాహేతర సంబంధానికి అడ్డు ఉండకూడదని భర్తను కడతేర్చింది. ఈ కేసులో నిందితురాలైన భార్యతోపాటు హత్యకు సహకరించిన ప్రియుడు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుత్తి సీఐ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ ప్రభాకర్‌ గౌడ్‌ మీడియాకు వెల్లడించారు.

పెళ్లికి ముందే ప్రేమాయణం
వైటీ చెరువుకు చెందిన (ప్రస్తుతం గుత్తిలో నివాసముంటున్నారు) బలిజ సుధాకర్‌కు, కర్నూల్‌ జిల్లా ప్యాపిలికి చెందిన మేనమామ కూతురైన వెంకటేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. దంపతుల ఇరువురు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. అయితే వెంకటేశ్వరి పదవ తరగతి చదువుతున్న సమయంలో క్లాస్‌మేట్‌ అయిన బలిజ రాజేష్‌తో ప్రేమలో పడింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే రాజేష్‌ పేదవాడు కావడం, పైగా తండ్రి కూడా లేకపోవడంతో వెంకటేశ్వరిని ఇవ్వడానికి ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో సుధాకర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

వివాహేతర బంధం బలపడిందిలా..
వివాహమైన అనంతరం వెంకటేశ్వరి -రాజేష్‌లు తరుచూ కలుసుకునే వారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాజేష్‌ జీపు డ్రైవర్‌గా పని చేసేవాడు. జీపులో వెంకటేశ్వరిని తీసుకుని అప్పుడప్పుడు ‘టూర్‌’కు వెళ్లేవాడు. ఈమె కూడా తరుచూ ప్యాపిలికి వెళ్లి రాజేష్‌తో సన్నిహితంగా మెలిగి వచ్చేది. ఈ క్రమంలో వెంకటేశ్వరి - రాజేష్‌లకు దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. సుధాకర్‌ను మట్టుపెడితే తమకు అడ్డు ఉండదని, పెళ్లి కూడా చేసుకోవచ్చుని భావించారు.

పథకం ప్రకారం హత్య..
ఈ నెల 15వ తేదీన సుధాకర్‌ను హత్య చేయడానికి పథ«క రచన చేశారు. రాజేష్‌ కర్నూల్‌కు చెందిన శివ కుమార్‌( డాబాలో పని చేసేవాడు)ను వెంట పెట్టుకుని  ఈ నెల 15వ తేదీ రాత్రి గుత్తికి వచ్చారు. వెంకటేశ్వరికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. సుధాకర్‌ పడుకున్నారని ఆమె చెప్పింది. దీంతో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో (16వ తేదీ) రాజేష్, శివకుమార్‌లు ఇంటి పైన ఉన్న ద్వారం నుంచి  లోపలికి ప్రవేశించారు. నిద్రలో ఉన్న సుధాకర్‌ను ముగ్గురూ కలిసి డంబెల్‌తో తలపై మోది హతమార్చారు. అనంతరం ఇదంతా నలుగురు దొంగలు చొరబడి రూ. 5 లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలు దోచుకుని, సుధాకర్‌ను చంపేశారని, తనను చున్నీతో చేతులు కట్టేసి గదిలో బంధించారని వెంకటేశ్వరి కట్టుకథ అల్లింది. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
కేసు ఎలా చేధించారంటే..
ఈ కేసును సీఐ ప్రభాకర్‌ గౌడ్,ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఐడీ పార్టీ పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. వెంకటేశ్వరి, రాజేష్, శివ కుమార్‌ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, కాల్‌ డేటాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుధాకర్‌ హత్యకు గురైన రోజు వెంకటేశ్వరి రాజేష్‌తో గంటల కొద్దీ మాట్లాడినట్లు తేలింది. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని వెంకటేశ్వరికి ఫోన్‌ చేయించారు. స్పీకర్‌ ఆన్‌ చేయించి మాట్లాడించారు. రాజేష్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలియకపోవడంతో వెంకటేశ్వరి రోజూ మాట్లాడినట్లే మాట్లాడింది.

‘నా భర్త సుధాకర్‌ను హతమార్చాం కదా ఈ విషయం పోలీసులకు తెలియకముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పింది. దీంతో పోలీసులు హుటాహుటినా వెళ్లి వెంకటేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. రాజేష్‌ను, వెంకటేశ్వరిని విడివిడిగా పోలీసులు ఇంటరాగేషన్‌ చేశారు. తమతో పాటు శివకుమార్‌ అనే వ్యక్తితో కలిసి డంబెల్‌తో సుధాకర్‌ తలపై మోది చంపామని అంగీకరించారు. దీంతో హంతకులు రాజేష్, వెంకటేశ్వరి, శివకుమార్‌లను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి వీరిని రిమాండ్‌కు ఆదేశించారు.

నగదు రివార్డును అందజేసిన డిఎస్పీ:
సంచలనం సృష్టించిన బలిజ సుధాకర్‌ హత్య కేసును వారం రోజుల్లోనే ఛేదించిన సీఐ ప్రభాకర్‌ గౌడ్, ఎస్‌ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఐడీ పార్టీ పోలీసులు రవి, మోహన్‌లకు డీఎస్పీ నగదు రివార్డులు ప్రకటించారు.  సీఐ ప్రభాకర్‌ గౌడ్‌ను ఫోన్‌లో ఎస్పీ అశోక్‌ కుమార్‌  ప్రత్యేకంగా అభినందించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement