కర్ణాటకలో ఉన్న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్
-
గతేడాది 30వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీళ్లు
-
9 ఏళ్లుగా రెండో పంటకు క్రాప్‌హాలిడే
-
ఆధునికీకరణ పేరిట ఏళ్ల తరబడి నష్టపోతున్న రైతులు
lజూరాల: వర్షాకాలంలో తళతళ మెరుస్తూ.. గలగల పరుగులు తీసే తుంగభద్ర ప్రస్తుతం నీళ్లు లేక తడారిపోయింది. చినుక లేక.. ఎగువనుంచి నీళ్లు రాక ఒట్టిపోయి రాళ్లూరప్పలతో బోసిపోయి కనిపిస్తోంది. వరుణుడు కరుణించక పోతాడా.. నీళ్లు రాకపోతాయా? అని కోటి ఆశలతో పంటలు సాగుచేసిన ఆయకట్టు రైతులు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ఇక భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశా లేదు.. పంటలు పండుతాయన్నా అవకాశమూ కనిపించడం లేదు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఏటేటా నష్టపోతున్న ఆర్డీఎస్ రైతులకు ఈ ఏడాదీ రెండు పంటలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 52.75 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో కురుస్తున్న అడపాదడపా వర్షాలతో కేవలం 8786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. అదేస్థాయిలో ప్రాజెక్టులోని ఎల్‌ఎల్‌సీ (లో లెవల్ కెనాల్), హెచ్‌ఎల్‌సీ (హై లెవల్ కెనాల్)ల పరిధిలోని ఆయకట్టుకు (8786 క్యూసెక్కుల) నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. అనుకోని విధంగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడటమో, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడమో జరిగితే మినహా పక్షం రోజుల్లో ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితులు కనిపించడం లేదు.
మొదటినుంచీ నష్టమే..
ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మొదటినుంచీ కష్టాలే వెంటాడుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో 1951 ప్రాంతంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో 87,500 ఎకరాలకు సాగునీరందేది. తర్వాతి కాలంలో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో సిల్టు ఏర్పడటం, కర్ణాటక పరిధిలో ఆయకట్టుకు మించి సాగునీటిని విడుదల చేసుకునేలా తూములు పగలగొట్టడంతో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి నీటిని విడుదల చేసుకోవడం తగ్గిపోయింది. గత 30 ఏళ్లుగా ఆర్డీఎస్ ఆయకట్టులో కేవలం 30వేల ఎకరాలకు మించి ఖరీఫ్‌లో సాగునీరు అందడం లేదు. రబీ సీజన్‌లోనూ అదే పరిస్థితి ఉంది. 2002లో కర్నూలు, పాలమూరు జిల్లా రైతుల మధ్య స్లూయిస్ రంధ్రాల విషయంలో ఘర్షణ జరిగింది. 2004లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారమిచ్చేలా ’ 92 కోట్లతో ఆధునికీకరణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. 2007లో ఆ««దlునికీకరణ పనులు ప్రారంభమైన నాటి నుంచి ఆర్డీఎస్‌లో రబీ సీజన్‌కు నీటి విడుదల చేయడం లేదు. పనుల పేరిట ఏటా రెండవ పంట కోల్పోతున్న రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కూడా నీళ్లందని పరిస్థితి ఏర్పడింది.
నీళ్లు రావడం కష్టమే!
తుంగభద్ర ప్రాజెక్టులో ఇప్పటి వరకు సగం వరకు కూడా నీళ్లు చేరలేదు. భారీ వర్షాలు కురుస్తాయన్న ఆశలూ కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఏటా నష్టపోతున్న ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ సాగునీరందని పరిస్థితి ఉంది. ఆర్డీఎస్ రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో ఇప్పటికే ఏటేటా నష్టపోతున్న ఆర్డీఎస్ రైతులు ఈ సారి తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయి.
– సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్