ఘాట్ ఉన్న విషయమే ఎవరికీ తెలీదు
గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిలో పుష్కర ఘాట్ను 150 మీటర్ల నుంచి 250 మీటర్లకు పెంచారు. అయితే.. వాస్తవానికి బయటకు మాత్రం ముందు నుంచి ఉన్న 150 మీటర్ల ఘాటే కనపడుతుంది. తర్వాత విస్తరించిన 100 మీటర్ల ఘాట్ అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పుష్కర స్నానం చేసి, గోదావరికి పూజలు ఆచరించి, వెళ్లిన తర్వాత.. ఒక్కసారిగా జనం లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే తోపులాట చోటుచేసుకుంది. మెట్ల మీద ఉన్న భక్తుల మీద వెనక నుంచి వచ్చిన భక్తులు పడ్డారు. దాంతో వాళ్లు ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక నలిగిపోయారు.
దానికి తోడు.. జనం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచే పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు. వీలైనంత త్వరగా స్నానం చేసుకుని వెళ్లాలనుకున్నారు. అంతలోనే తొక్కిసలాట జరిగింది. ఇక.. ముందు నుంచి ప్లాస్టిక్ మీద నిషేధం ఉందని చెప్పడంతో, కనీసం నీళ్ల బాటిళ్లు కూడా ఎవరూ తీసుకెళ్లలేదు, వాళ్లకు నీళ్ల ప్యాకెట్లు కూడా పంపిణీ చేయలేదు. దాంతో ఆ తొక్కిసలాట తర్వాత కనీసం గుక్కెడు నీళ్లు తాగే అవకాశం కూడా లేదు. ఈ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శవాలు అనుకుని కింద పారేసిన మహిళల్లో ఒకరికి నీళ్లు పట్టించగా.. తర్వాత ఆమె లేచి కూర్చున్నారు. ఇలాంటి అంశాల వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.