pushkaralu deaths
-
బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే భక్తుల బలి
* చంద్రబాబును ఏ-1గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి * వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పబ్లిసిటీ పిచ్చి, మీడియా పిచ్చి వల్లే గోదావరి పుష్కరాల్లో భక్తులు బలయ్యారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆయనను ప్రథమ ముద్దాయి(ఏ-1)గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించానంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు పడిన తాపత్రయమే దుర్ఘటనకు కారణమని మండిపడ్డారు. భారీ జన సందోహం ఉండేటట్లుగా చంద్రబాబు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. జనం మధ్య తాను స్నానం చేస్తూ పుష్కరాలను ఎలా నిర్వహించానో చూడండని టెలిఫిల్మ్‌లు తీయించుకోవడానికి బాబు ఆరాటపడ్డారని దుయ్యబట్టారు. విషాదం చోటుచేసుకోవడానికి ముందు వెనుక ఏం జరిగిందో ఆమె వివరించారు. ‘‘చంద్రబాబు ఉదయం 6 గంటలకు పుష్కర ఘాట్‌కు వచ్చారు. ఆయన వస్తున్నారని 5 గంటల (ఒక గంట ముందే)కే పుష్కరఘాట్‌లోకి జనాన్ని వెళ్లనీయకుండా ఆపారు. చంద్రబాబు స్నానం చేసింది 6.32 గంటలకు, పూజలు చేసింది 6.35 గంటలకు, పిండాలు పెట్టడం 7.07కు ప్రారంభించి 7.15 గంటలకు ముగించారు. 7.45 వరకు అక్కడే గడిపి 8 గంటల ప్రాంతంలో పుష్కర ఘాట్ నుంచి వెళ్లి పోయారు. అంటే సుమారు 3 గంటలకు పైగా జనం అక్కడే వేచి ఉండేలా చేశారు. ఆయన వెళ్లిపోగానే తొక్కిసలాట జరిగి భక్తులు మృత్యువాత పడ్డారు’’ అని తెలిపారు.ఘాట్‌లో చంద్రబాబు స్నానం ఆచరిస్తున్నప్పుడు బయట లక్షల సంఖ్యలో వేచి ఉన్న జనం చిత్రాలను వాసిరెడ్డి పద్మ ప్రదర్శించారు. తొక్కిసలాటలో భక్తులు గాయపడితే వారికి అందాల్సిన వైద్య సేవలను పర్యవేక్షించాల్సిన చంద్రబాబు దుర్ఘటన గురించి టీవీల్లో ప్రసారం కాకుండా చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆమె ఆరోపించారు. తొక్కిసలాట దృశ్యాలు టీవీల్లో రాకుండా మేనేజ్ చేశారని మండిపడ్డారు. భక్తుల ప్రాణాలను బలిగొన్న నేరస్థుడే సీఎం అయినప్పుడు న్యాయవిచారణకు ఆదేశించే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. లోకేష్ ట్రస్ట్ పేరుతో కొందరు పచ్చచొక్కాలు వేసుకుని తిరగడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ పేరుతో ఇంకా ట్రస్టులెందుకు? ఏపీ ప్రభుత్వ ఖజానా మొత్తం ఆయన ట్రస్టే కదా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
వేటు ఎవరిపైనో?
సాక్షిప్రతినిధి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో ఎవరిపై వేటువేస్తారనే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 27 మంది ప్రాణాలు కోల్పోయిన ఘోర దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అంటూ సామాన్య జనంతో పాటు ప్రతిపక్షం, మిత్రపక్షం అనే తేడా లేకుండా అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విమర్శల నుంచి బయట పడేందుకు తమను బాధ్యులను చేసేందుకు పావులు కదుపుతున్నారని రెవెన్యూ, పోలీసు అధికారులే కాకుండా కొందరు మంత్రులూ భయపడుతున్నారని తెలుస్తోంది. బుధవారం రాజమండ్రిలో బసచేసిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమా, మృణాళిని మధ్య ఈ అంశం చర్చకు వచ్చిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నతస్థాయిలో ఒకరిద్దరు, జిల్లాస్థాయిలో నలుగురైదుగురు అధికారులను, పరిస్థితులను బట్టి ఒకరిద్దరు మంత్రులను బాధ్యులను చేసే భారీ స్కెచ్ నడుస్తోంది. తనకు అనుకూలమైన పత్రికల్లో బాధ్యతంతా తమపై నెట్టేసేలా కథనాలు రాయించడం ఇందులో భాగమేనని అధికార వర్గాలు నొచ్చుకుంటున్నాయి. పుష్కర ఏర్పాట్లు ప్రారంభమైన దగ్గర నుంచి సీఎం తను నమ్మినబంటులైన మంత్రులు యనమల, నారాయణలకు పుష్కర కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీకి చెందిన దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావును సభ్యుడిగా తీసుకున్నా నామ్‌కే వాస్తేగా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా చెప్పుకొచ్చారు. లోపాలన్నీ తమ దగ్గరే పెట్టుకొని పుష్కరాలు అట్టహాసంగా జరిగి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారనే ప్రచార ఆర్బాటం కోసం పుష్కరఘాట్‌లో జాతీయ, అంతర్జాతీయ ఇంగ్లిషు చానల్స్‌కు లఘుచిత్రాలు చిత్రీకరించేందుకు అనుమతించడం, కేవలం పుష్కరఘాట్కే భక్తులను తరలివచ్చేలా చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. తీరా ఇప్పుడు తప్పంతా తమదన్నట్టు వ్యవహరిస్తున్నారని అధికారులు మండిపడుతున్నారు. లోపాలన్నీ తమ దగ్గరే పెట్టుకుని మంగళవారం అర్ధరాత్రి రాజమండ్రి సమావేశంలో ఉన్నతాధికారులపై సీఎం సీరియస్ అయ్యారని బుధవారం పలు జిల్లాల నుంచి పుష్కర విధులకు వచ్చిన ఐపీఎస్‌ల మధ్య చర్చ నడుస్తోంది. పోలీసుల కారణంగా దోషులుగా విమర్శలు ఎదుర్కోవల్సిన పరిస్థితి వచ్చిందని ఒక మంత్రి పోలీసులపై అసహనం వ్యక్తం చేయడం సీఎం పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు సిద్ధపడుతున్నారనే సంకేతాలిచ్చినట్టేనంటున్నారు. ఈ విషయంలోరాష్ట్రస్థాయి పోలీసు అధికారి, తూర్పుగోదావరి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీతో పాటు మరికొందరు అధికారులను బాధ్యులు చేస్తారనే చర్చ నడుస్తోంది.ఉన్నతాధికారులతో పాటు కేబినెట్ నుంచి ఒకరిద్దరిని తప్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అవసరమైతే కొందరు మంత్రులపైనా చర్యలు తప్పవనే వాదన బలంగా విన్పిస్తోంది. -
తొక్కిసలాట.. చిన్న దుర్ఘటన
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య * పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశా * అప్పటికే చేయి దాటిపోయింది * రాష్ట్రంలో నదుల అనుసంధానానికి అవకాశాలున్నాయని వెల్లడి సాక్షి, రాజమండ్రి/ధవళేశ్వరం/హైదరాబాద్: గోదావరి పుష్కర ఘాట్‌లో 27 మంది భక్తుల మృతికి కారణమైన తొక్కిసలాటను ఒక చిన్న దుర్ఘటనగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. రాజమండ్రిలో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నీటి ప్రాముఖ్యత-నదుల అనుసంధానం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో, ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు జయంతి సభలోనూ సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ దుర్ఘటనను ప్రస్తావించారు. తొక్కిసలాట జరిగిన తర్వాత కంట్రోల్‌రూంకు వెళ్లి పరిస్థితిని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశానని, అప్పటికే చేయి దాటిపోయిందన్నారు. భక్తులు మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి జీవనాడిలాంటి గోదావరి జలాల సద్వినియోగంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని చర్చా గోష్టిలో సీఎం పేర్కొన్నారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో కనీసం వెయ్యి టీఎంసీలు సద్వినియోగం చేసుకున్నా రాష్ట్రంలో కరువు పరిస్థితులే ఉండవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార నదులను గోదావరి నదితో అనుసంధానం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. గోదావరి నీటిని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి నాలుగేళ్లలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి పట్టిసీమ నీళ్లు వచ్చే నెల 15న పట్టిసీమ ప్రాజెక్టు మొదటి దశ కింద సాగునీరు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు.. కేఎల్ జయంతి సభలో చెప్పారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, రామతీర్థం, వెలుగొండ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత వేగంగా నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేసి తీరుతానని, అప్పటికీ పూర్తికాకపోతే కృష్ణానదికి అనుసంధానం చేస్తామని వివరించారు. గోదావరి జిల్లాల్లో మూడో పంటకు కూడా నీరిచ్చే పరిస్థితి తీసుకువస్తామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన అత్తాకోడళ్లు మట్టపర్తి సత్యవతి, మట్టపర్తి అనంతలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ధవళేశ్వరం కొత్తపేటలో ఉన్న మృతుల నివాసానికి చంద్రబాబు వచ్చారు. అనంతలక్ష్మి భర్త వెంకట రమణ, ఆమె కుమారులు, సత్యవతి కుమార్తె కుడుపూడి వెంకట సత్యదుర్గను ఓదార్చారు. రెండు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. రాజమండ్రి సీసీసీని సందర్శించిన సీఎం పుష్కరాల బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం పోలీసు విభాగం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను సీఎం చంద్రబాబు బుధవారం సందర్శించారు. ఈ కేంద్రం పని తీరును ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఉభయగోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. -
ఘాట్ ఉన్న విషయమే ఎవరికీ తెలీదు
గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిలో పుష్కర ఘాట్‌ను 150 మీటర్ల నుంచి 250 మీటర్లకు పెంచారు. అయితే.. వాస్తవానికి బయటకు మాత్రం ముందు నుంచి ఉన్న 150 మీటర్ల ఘాటే కనపడుతుంది. తర్వాత విస్తరించిన 100 మీటర్ల ఘాట్ అసలు ఉన్నట్లే ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పుష్కర స్నానం చేసి, గోదావరికి పూజలు ఆచరించి, వెళ్లిన తర్వాత.. ఒక్కసారిగా జనం లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే తోపులాట చోటుచేసుకుంది. మెట్ల మీద ఉన్న భక్తుల మీద వెనక నుంచి వచ్చిన భక్తులు పడ్డారు. దాంతో వాళ్లు ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లలేక నలిగిపోయారు. దానికి తోడు.. జనం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచే పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నారు. వీలైనంత త్వరగా స్నానం చేసుకుని వెళ్లాలనుకున్నారు. అంతలోనే తొక్కిసలాట జరిగింది. ఇక.. ముందు నుంచి ప్లాస్టిక్ మీద నిషేధం ఉందని చెప్పడంతో, కనీసం నీళ్ల బాటిళ్లు కూడా ఎవరూ తీసుకెళ్లలేదు, వాళ్లకు నీళ్ల ప్యాకెట్లు కూడా పంపిణీ చేయలేదు. దాంతో ఆ తొక్కిసలాట తర్వాత కనీసం గుక్కెడు నీళ్లు తాగే అవకాశం కూడా లేదు. ఈ కారణంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శవాలు అనుకుని కింద పారేసిన మహిళల్లో ఒకరికి నీళ్లు పట్టించగా.. తర్వాత ఆమె లేచి కూర్చున్నారు. ఇలాంటి అంశాల వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. -
చంద్రబాబుతో మాట్లాడి.. చర్చించా
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇద్దరూ ట్విట్టర్ ద్వారా తమ సంతాపం తెలిపారు. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడానని, పరిస్థితిపై ఆయనతో చర్చించానని తెలిపారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది పుష్కరాల ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వాళ్ల కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు కూడా మృతుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని, అలాగే క్షతగాత్రులకు వైద్య సాయం అందించేందుకు సాధ్యమైనంత కృషి చేయాలని ఆయన సూచించారు. Deeply pained at the loss of lives due to stampede at Rajahmundry. My condolences to the families of the deceased & prayers with the injured — Narendra Modi (@narendramodi) July 14, 2015 I spoke to CM @ncbn & discussed the situation with him. The State Government is working to restore normalcy. — Narendra Modi (@narendramodi) July 14, 2015 Heartfelt condolences on the loss of lives in a stampede at Pushkarulu Ghat of Godavari River in Andhra Pradesh #PresidentMukherjee — President of India (@RashtrapatiBhvn) July 14, 2015 Call upon State Govt & other agencies to provide all possible aid to bereaved families & medical assistance to injured #PresidentMukherjee — President of India (@RashtrapatiBhvn) July 14, 2015 -
పోయిన ప్రాణాలను తీసుకురాలేం: చంద్రబాబు
పుష్కరాల దుర్ఘటనలో మృతుల కుటుంబాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా ఆయన పలకరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పోయిన ప్రాణాలను ఎటూ తిరిగి తీసుకురాలేమని, జరిగిన ఘటన పట్ల చాలా బాధగా ఉందని ఆయన అన్నారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే... ఈవెంట్ జరగాలి, మరో 11 రోజులు పుష్కరాలు జరగాల్సి ఉంది అవి అయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం మంచి వైద్యం అందించడానికి ప్రయత్నిస్తున్నాం 11 రోజులు ఇక్కడే ఉండి పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తాను సర్వైలెన్స్ కెమెరాలు అన్నీ పెట్టాం సరస్వతీ ఘాట్ ఖాళీగా ఉంటే కొంతమందిని అక్కడకు డైవర్ట్ చేశాం కానీ అప్పటికే ఘటన జరిగింది. ఎంత నియంత్రించాలన్నా సమయం పడుతుంది గంటా రెండు గంటలైనా పడుతుంది -
నైతిక బాధ్యత వహించి బాబు రాజీనామా చేయాలి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాశీ వెళ్లి పుణ్యస్నానం చేసి చంద్రబాబు తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆయన అన్నారు. అసలు వీఐపీ ఘాట్ ఉండగా.. దాన్ని వదిలి ప్రచారం కోసం పుష్కరఘాట్‌లో చంద్రబాబు స్నానం చేయడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలాగంటూ నిలదీశారు. పనులను శాఖలకు విభజించకుండా పేరు అంతా తనకే దక్కాలని చంద్రబాబు అనుకుంటే ఎలాగని అడిగారు. తొక్కిసలాట జరిగిన తర్వాత అధికారులను బాధ్యులను చేయడం ఏంటని మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబులో మానవత్వం అనేది ఏమాత్రం ఉన్నా రాజీనామా చేసి, కాశీకి పోయి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చంద్రబాబు ఘాట్ వద్ద ఉండిపోవడంతో.. ప్రజలు ఎవరూ నీళ్లలోకి దిగే అవకాశం కూడా లేకుండా గేట్లన్నీ మూసేసరికి భక్తులు కిలోమీటరున్నర మేర రెండున్నర గంటల పాటు ఇరుక్కుపోయారు వెనక్కి పోవాలన్నా వెళ్లే మార్గం లేదు, ఆ పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు తన పూజలు అయిపోయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బయల్దేరిన తర్వాత అప్పుడు గేట్లు ఒక్కసారిగా తెరిచారు. దాంతో ముందర ఉన్నవాళ్ల మీద వెనక ఉన్నవాళ్లు పడి, తోపులాట జరిగింది. దీనికి న్యాయ విచారణ కావాలా? చంద్రబాబును తీసుకుపోయి జైల్లో పెట్టాలి బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. వీఐపీ ఘాట్‌లో పూజలు ఎందుకు చేసుకోలేదు? అక్కడ ఎంత సేపున్నా ఎవరూ అడగరు కదా కేటాయించిన ఘాట్ వదిలి, పబ్లిసిటీ కోసం వేరే ఘాట్‌కు వచ్చి, తోపులాటకు కారణమయ్యారు ఇప్పుడు ఇంకా న్యాయవిచారణ చేస్తానంటున్నారు ఇప్పుడు అధికారులను బకరాలను చేసి, వాళ్లను ఉద్యోగాల నుంచి ఊడగొట్టి, చంద్రబాబు తప్పుకోడానికేనా? ఎండోమెంట్ మినిస్టరే చివరకు తనను ఇన్వాల్వ్ చేయడంలేదు, స్థానం కల్పించడంలేదని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఉన్నప్పుడు దేవాదాయ మంత్రి ఉంటేనేం, రాకపోతేనేం అన్నారు. ఇంతకన్నా దారుణం, కిరాతకం బహుశా ఏమీ ఉండవేమో. మనుషులను బలిపశువులను చేశారు.