నైతిక బాధ్యత వహించి బాబు రాజీనామా చేయాలి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాశీ వెళ్లి పుణ్యస్నానం చేసి చంద్రబాబు తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆయన అన్నారు.
అసలు వీఐపీ ఘాట్ ఉండగా.. దాన్ని వదిలి ప్రచారం కోసం పుష్కరఘాట్లో చంద్రబాబు స్నానం చేయడమేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలాగంటూ నిలదీశారు. పనులను శాఖలకు విభజించకుండా పేరు అంతా తనకే దక్కాలని చంద్రబాబు అనుకుంటే ఎలాగని అడిగారు. తొక్కిసలాట జరిగిన తర్వాత అధికారులను బాధ్యులను చేయడం ఏంటని మండిపడ్డారు. ఆయన ఏమన్నారంటే..
- చంద్రబాబులో మానవత్వం అనేది ఏమాత్రం ఉన్నా రాజీనామా చేసి, కాశీకి పోయి ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
- చంద్రబాబు ఘాట్ వద్ద ఉండిపోవడంతో.. ప్రజలు ఎవరూ నీళ్లలోకి దిగే అవకాశం కూడా లేకుండా గేట్లన్నీ మూసేసరికి భక్తులు కిలోమీటరున్నర మేర రెండున్నర గంటల పాటు ఇరుక్కుపోయారు
- వెనక్కి పోవాలన్నా వెళ్లే మార్గం లేదు, ఆ పరిస్థితి లేదు
- చంద్రబాబు నాయుడు తన పూజలు అయిపోయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బయల్దేరిన తర్వాత అప్పుడు గేట్లు ఒక్కసారిగా తెరిచారు.
- దాంతో ముందర ఉన్నవాళ్ల మీద వెనక ఉన్నవాళ్లు పడి, తోపులాట జరిగింది. దీనికి న్యాయ విచారణ కావాలా?
- చంద్రబాబును తీసుకుపోయి జైల్లో పెట్టాలి
- బాధ్యతగల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి.. వీఐపీ ఘాట్లో పూజలు ఎందుకు చేసుకోలేదు? అక్కడ ఎంత సేపున్నా ఎవరూ అడగరు కదా
- కేటాయించిన ఘాట్ వదిలి, పబ్లిసిటీ కోసం వేరే ఘాట్కు వచ్చి, తోపులాటకు కారణమయ్యారు
- ఇప్పుడు ఇంకా న్యాయవిచారణ చేస్తానంటున్నారు
- ఇప్పుడు అధికారులను బకరాలను చేసి, వాళ్లను ఉద్యోగాల నుంచి ఊడగొట్టి, చంద్రబాబు తప్పుకోడానికేనా?
- ఎండోమెంట్ మినిస్టరే చివరకు తనను ఇన్వాల్వ్ చేయడంలేదు, స్థానం కల్పించడంలేదని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఉన్నప్పుడు దేవాదాయ మంత్రి ఉంటేనేం, రాకపోతేనేం అన్నారు.
- ఇంతకన్నా దారుణం, కిరాతకం బహుశా ఏమీ ఉండవేమో. మనుషులను బలిపశువులను చేశారు.