తొక్కిసలాట.. చిన్న దుర్ఘటన
ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
* పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశా
* అప్పటికే చేయి దాటిపోయింది
* రాష్ట్రంలో నదుల అనుసంధానానికి అవకాశాలున్నాయని వెల్లడి
సాక్షి, రాజమండ్రి/ధవళేశ్వరం/హైదరాబాద్: గోదావరి పుష్కర ఘాట్‌లో 27 మంది భక్తుల మృతికి కారణమైన తొక్కిసలాటను ఒక చిన్న దుర్ఘటనగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు.
రాజమండ్రిలో బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ‘నీటి ప్రాముఖ్యత-నదుల అనుసంధానం’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో, ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు జయంతి సభలోనూ సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ దుర్ఘటనను ప్రస్తావించారు. తొక్కిసలాట జరిగిన తర్వాత కంట్రోల్‌రూంకు వెళ్లి పరిస్థితిని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేశానని, అప్పటికే చేయి దాటిపోయిందన్నారు. భక్తులు మృతిచెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు.
రాష్ట్రానికి జీవనాడిలాంటి గోదావరి జలాల సద్వినియోగంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని చర్చా గోష్టిలో సీఎం పేర్కొన్నారు. సముద్రంలో వృథాగా కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిలో కనీసం వెయ్యి టీఎంసీలు సద్వినియోగం చేసుకున్నా రాష్ట్రంలో కరువు పరిస్థితులే ఉండవని పేర్కొన్నారు. రాష్ట్రంలో కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార నదులను గోదావరి నదితో అనుసంధానం చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. గోదావరి నీటిని కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి నాలుగేళ్లలో తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
ఆగస్టు 15 నుంచి పట్టిసీమ నీళ్లు
వచ్చే నెల 15న పట్టిసీమ ప్రాజెక్టు మొదటి దశ కింద సాగునీరు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు.. కేఎల్ జయంతి సభలో చెప్పారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, రామతీర్థం, వెలుగొండ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత వేగంగా నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. పులిచింతల ప్రాజెక్టుకు కేఎల్ రావు పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తిచేసి తీరుతానని, అప్పటికీ పూర్తికాకపోతే కృష్ణానదికి అనుసంధానం చేస్తామని వివరించారు. గోదావరి జిల్లాల్లో మూడో పంటకు కూడా నీరిచ్చే పరిస్థితి తీసుకువస్తామన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరానికి చెందిన అత్తాకోడళ్లు మట్టపర్తి సత్యవతి, మట్టపర్తి అనంతలక్ష్మి మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ధవళేశ్వరం కొత్తపేటలో ఉన్న మృతుల నివాసానికి చంద్రబాబు వచ్చారు. అనంతలక్ష్మి భర్త వెంకట రమణ, ఆమె కుమారులు, సత్యవతి కుమార్తె కుడుపూడి వెంకట సత్యదుర్గను ఓదార్చారు. రెండు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
రాజమండ్రి సీసీసీని సందర్శించిన సీఎం
పుష్కరాల బందోబస్తు, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం పోలీసు విభాగం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)ను సీఎం చంద్రబాబు బుధవారం సందర్శించారు. ఈ కేంద్రం పని తీరును ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఉభయగోదావరి జిల్లాల్లోని పుష్కర ఘాట్లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.