బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే భక్తుల బలి | Babu publicity due to the mad crowds death | Sakshi
Sakshi News home page

బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే భక్తుల బలి

Published Thu, Jul 16 2015 3:23 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే భక్తుల బలి - Sakshi

బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే భక్తుల బలి

* చంద్రబాబును ఏ-1గా చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి
* వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్  

సాక్షి, హైదరాబాద్:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పబ్లిసిటీ పిచ్చి, మీడియా పిచ్చి వల్లే గోదావరి పుష్కరాల్లో భక్తులు బలయ్యారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఆయనను ప్రథమ ముద్దాయి(ఏ-1)గా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించానంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు చంద్రబాబు పడిన తాపత్రయమే దుర్ఘటనకు కారణమని మండిపడ్డారు. భారీ జన సందోహం ఉండేటట్లుగా చంద్రబాబు ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పారు. జనం మధ్య తాను స్నానం చేస్తూ పుష్కరాలను ఎలా నిర్వహించానో చూడండని టెలిఫిల్మ్‌లు తీయించుకోవడానికి బాబు ఆరాటపడ్డారని దుయ్యబట్టారు.

విషాదం చోటుచేసుకోవడానికి ముందు వెనుక ఏం జరిగిందో ఆమె వివరించారు. ‘‘చంద్రబాబు ఉదయం 6 గంటలకు పుష్కర ఘాట్‌కు వచ్చారు. ఆయన వస్తున్నారని 5 గంటల (ఒక గంట ముందే)కే పుష్కరఘాట్‌లోకి జనాన్ని వెళ్లనీయకుండా ఆపారు. చంద్రబాబు స్నానం చేసింది 6.32 గంటలకు, పూజలు చేసింది 6.35 గంటలకు, పిండాలు పెట్టడం 7.07కు ప్రారంభించి 7.15 గంటలకు ముగించారు.

7.45 వరకు అక్కడే గడిపి 8 గంటల ప్రాంతంలో పుష్కర ఘాట్ నుంచి వెళ్లి పోయారు. అంటే సుమారు 3 గంటలకు పైగా జనం అక్కడే వేచి ఉండేలా చేశారు. ఆయన వెళ్లిపోగానే తొక్కిసలాట జరిగి భక్తులు మృత్యువాత పడ్డారు’’ అని తెలిపారు.ఘాట్‌లో చంద్రబాబు స్నానం ఆచరిస్తున్నప్పుడు బయట లక్షల సంఖ్యలో వేచి ఉన్న జనం చిత్రాలను వాసిరెడ్డి పద్మ ప్రదర్శించారు.

తొక్కిసలాటలో భక్తులు గాయపడితే వారికి అందాల్సిన వైద్య సేవలను పర్యవేక్షించాల్సిన చంద్రబాబు దుర్ఘటన గురించి టీవీల్లో ప్రసారం కాకుండా చేసే పనిలో నిమగ్నమయ్యారని ఆమె ఆరోపించారు. తొక్కిసలాట దృశ్యాలు టీవీల్లో రాకుండా మేనేజ్ చేశారని మండిపడ్డారు. భక్తుల ప్రాణాలను బలిగొన్న నేరస్థుడే సీఎం అయినప్పుడు న్యాయవిచారణకు ఆదేశించే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. లోకేష్ ట్రస్ట్ పేరుతో కొందరు పచ్చచొక్కాలు వేసుకుని తిరగడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ పేరుతో ఇంకా ట్రస్టులెందుకు? ఏపీ ప్రభుత్వ ఖజానా మొత్తం ఆయన ట్రస్టే కదా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement