► రేషన్ కార్డుల పంపిణీ ఇప్పట్లో లేనట్లే
► గతేడాది ఆగస్టులో పంపించిన ప్రభుత్వం
► జిల్లాల విభజన కారణంతో ఆగిపోయిన పంపిణీ
► కొత్తవి ముద్రించి ఇస్తామన్న సర్కారు.. మళ్లీ ఊసే లేదు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): కొత్త రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కలగానే మారింది.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటింది. ఇదిగో రేషన్ కార్డులు.. అదిగో రేషన్ కార్డులు అంటూ ఊరించడమే తప్ప ఇంతవరకు లబ్ధిదారులకు ఇచ్చింది లేదు. కొత్త హంగులు, రంగులతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలు సైతం రంగుల్లోనే ముద్రించి ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం మౌనం వహిస్తోంది. మూడేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు జారీ చేసింది లేదు.
అయితే వాస్తవానికి ప్రభుత్వం రేషన్ కార్డులను గతంలోనే ముద్రించి జిల్లాకు పంపింది. 2016 ఆగస్టులో జిల్లాల విభజన జరగక ముందు నిజామాబాద్, కామారెడ్డికి కలిపి 6.23 లక్షల కొత్త రేషన్ కార్డులను ముద్రించి పంపించింది. అదే సమయంలో జిల్లాలు, మండలాల విభజన తెరపైకి రావడం, ఏర్పాటు కావడం జరిగి పోయాయి. అప్పటికే జిల్లా పౌరసరఫరాల శాఖకు వచ్చిన రేషన్ కార్డులను మండలాల వారీగా విభజన చేసి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించారు.
జిల్లాల విభజన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లబ్ధిదారులకు ఆహార భద్రతకార్డులు పంపిణీ చేయవద్దని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు జరగడంతో రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
జిల్లా, మండలాల విభజన, కొత్త మండలాలు ఏర్పడడంతో ముద్రించిన రేషన్ కార్డుల్లో పేర్లు మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం, తహసీల్దార్ కార్యాలయాల్లోనే రేషన్ కార్డులు మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి ముద్రించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది అవుతున్నా.. ఇంతవరకు ఎలాంటి ఉలుకుపలుకు లేదు. అదే విధంగా ప్రస్తుతం రేషన్ షాపుల ప్రక్షాళన మొదలైంది. ఈ నెలలోనే రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పట్లో రేషన్ కార్డుల ముద్రణ జరిగే అవకాశాలు లేవు. దీంతో మరికొన్ని నెలలు, లేదా మరో సంవత్సరం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మళ్లీ ఆన్‌లైన్ స్టేటస్ కాగితాలే దిక్కు..
లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు పొందాలంటే గతంలో రేషన్ కార్డులు తీసుకుని వెళ్లే వారు. రేషన్ కార్డు ఉంటే ఎంతో ధీమాగా ఉండేది. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రేషన్ కార్డులు లబ్ధిదారుల చేతికి అందలేదు. ఆన్‌లైన్‌లో ఉన్న స్టేటస్ కాగితాలే దిక్కయ్యాయి. ప్రతీ నెలా లబ్ధిదారులు ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్‌లైన్ స్టేటస్ తీసుకుని రావాలని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రతా కార్డులు 3,55,678, 19,946 అంత్యోదయ, 1146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ మొత్తం కార్డులు కలిపి 3,76,770 కార్డులున్నాయి. వీరందరు ముద్రించిన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
గతేడాది ఉమ్మడి జిల్లాకు కలిపి రేషన్ కార్డులను ముద్రించి పంపించారు. అయితే జిల్లాలు, మండలాల విభజన కారణంగా రేషన్ కార్డుల పంపిణీ నిలిచి పోయింది. జిల్లా, మండలాల పేర్లు మార్చి మళ్లీ ముద్రించి పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని, కార్డులను ముద్రించి జిల్లాకు పంపాల్సి ఉంది. – కృష్ణ ప్రసాద్, డీఎస్‌వో