పశువుల బీమాకు మంగళం?
పశువుల బీమాకు మంగళం?
Published Wed, Jul 19 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
మూడేళ్లుగా ప్రీమియం కట్టించుకోని అధికారులు
ఆర్థికంగా కుంగిపోతున్న పశు పోషకులు
రాయవరం (మండపేట) : పశువుల బీమా ప్రీమియాన్ని 2015 మార్చి నుంచి అధికారులు కట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే తీసుకుంటామని చెబుతున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు ప్రీమియం చెల్లించాలో అన్న అయోమయంలో పశు పోషకులు కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రైతులకు పశు సంపద ప్రధానమైంది. ఈ సంపదను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మనుషులకు మాదిరిగా పశువులకు కూడా బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అయితే మూడేళ్లుగా బీమా పథకానికి సంబంధించి సబ్సిడీ విడుదల కావడం లేదు. రైతులు నేరుగా బీమా చేయించుకుంటే అధిక మొత్తం చెల్లించడం భారం అవుతుందని వారు వెనుకంజ వేస్తున్నారు.
అర్ధాంతరంగా చనిపోతే..
అప్పు చేసి కొన్న పశువులు అర్ధాంతరంగా మరణిస్తే రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతుంది. మేత కోసం బయటకు వెళ్లిన పశువులు సాయంత్రం తిరిగి వచ్చే వరకు పలు ప్రమాదాలు వెన్నాడుతుంటాయి. విద్యుత్.. రోడ్డు ప్రమాదం..విష పదార్ధాలతో కూడిన గడ్డిని తిన్నప్పుడు.. ప్రకృతి వైపరీత్యాలు.. అగ్ని ప్రమాదాల్లో అవి మృత్యువాత పడుతుంటాయి. గేదెలు, ఆవులు దొమ్మరోగం, గాలికుంటు తదితర జబ్బుల బారిన పడే సమయంలో మరణాలు తప్పడంలేదు.
జిల్లాలో 10.21 లక్షల పశువులు
పశు సంవర్ధక శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 10.21 లక్షల పశువులున్నాయి. వీటికి బీమా చేయించుకునేందుకు గ్రామాల్లో రైతులు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఒక రైతుకు రెండు గేదెలకు బీమా చేసుకునే అవకాశం ఉండేది. ఒక్కో గేదెకు రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు బీమా లభిస్తుంది. అధికారులు ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా గేదెలకు సంబంధించిన ధర ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణయించిన ధరలో ఏడు శాతం ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇందులో రైతు, ప్రభుత్వం చెరిసగం భరించాలి. రైతుకు రూ.1.6 లక్షల వరకూ బీమా వర్తిస్తుంది. ఏడాది, మూడు ఏళ్ల కాల పరిమితికి బీమా సౌకర్యం ఉంది. క్షీరసాగర పథకం కింద 6,7 నెలల గర్భం ఉన్న గేదెలు, ఆవులకు బీమా సౌకర్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటివరకు విధి విధానాలను రూపొందించలేదు.
సబ్సిడీ సొమ్ము విడుదల కాలేదు
పశువుల బీమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి సబ్సిడీ సొమ్ము కాలేదు. బీమా గురించి రైతులు అడుగుతున్నారు. బీమా సౌకర్యం ఉండే పాడి రైతులకు ప్రయోజనం ఉంటుంది. సబ్సిడీ వస్తే పథకం పునరుద్ధరణకు అవకాశం అవకాశం ఉంది.
– డీజీఆర్ అంబేడ్కర్, ఈఓ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ
Advertisement