స్పందించిన మోదీ.. పెళ్లిపీటలెక్కనున్న యువతి
మల్కన్‌గిరి:
తన పెళ్లికి సహాయం చేయాలని కోరుతూ ఓ యువతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖకు వెంటనే స్పందన వచ్చింది. దీంతో ఆ యువతి ఆనందంగా పెళ్లిపీటలెక్కనుంది. వివరాలిలా ఉన్నాయి. బౌద్ధు జిల్లా ఉచ్చోబహల్ గ్రామంలో నివసిస్తున్న సదానంద నాయక్ రెవెన్యూశాఖలో క్లాస్ 4 ఉద్యోగి. సదానంద గతంలో ఇంటినిర్మాణం కోసం బ్యాంక్‌లో రూ.లక్ష 80వేలు లోను తీసుకున్నాడు. అది పూర్తిగా తీర్చలేకపోయాడు.
రెండు నెలల క్రితం సదానంద తన కుమార్తె పెళ్లి చేయడం కోసం నిశ్చితార్థం చేశాడు. పెళ్లి కోసం మళ్లీ బ్యాంకులో లోన్ కోసం అప్లై చేశాడు. అయితే బ్యాంకు వారు ముందు తీసుకున్నది..తీర్చలేదు కనుక ఇప్పుడు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తండ్రి పడుతున్న బాధను చూసి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తారనే ఆశతో సదానంద కుమార్తె ప్రియభతి నాయక్ పెళ్లి కోసం ఆర్థిక సహాయం కోరుతూ ప్రధానమంత్రి మోదీకి ఒక లేఖ రాసింది. ఆ లేఖకు ప్రధాని స్పందించారు.
వెంటనే బౌధు జిల్లా కలెక్టర్ మధుసూదన్ మిశ్రోకు ప్రధాని కార్యాలయం నుంచి లేఖ వచ్చింది. బ్యాంకు నుంచి ప్రియభత్‌కు సహాయం చేయవల్సిందిగా కలెక్టర్ మధుసూదన్‌ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ మధుసూదన్ వెంటనే బ్యాంకు వారిని పిలిచి లోన్ ఎందుకు ఇవ్వరు. తప్పకుండా ఇవ్వాల్సిందేనని చెప్పి రూ.మూడు లక్షల 44 వేలు మంజూరు చేయించారు. దీంతో ప్రియభతి వివాహం ఈ నెల 24న ఆనందంగా జరగనుంది. తనకు ఇంత సహాయం చేసిన ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ తన పెళ్లి పత్రికను పంపుతామంటూ ప్రియభతి ఆనందం వ్యక్తం చేస్తోంది.