మున్నేరు వాగులో తగ్గిన వరద ఉధృతి
ఖమ్మం వ్యవసాయం: వరుణుడు శాంతించాడు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహ ఉధృతి తగ్గుతోంది. జలాశయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. నీట మునిగిన పంటలను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి నైరుతి రుతు పవనాలకు తోడవడంతో దాదాపు పది రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ అధిక వర్షాలతో పంటలు నీట మునిగాయి. కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి.
- తగ్గిన వర్ష తీవ్రత
వర్షాలు మంగళవారం నుంచి తగ్గుముఖం పట్టాయి. బుధవారం జిల్లా సగటు వర్షపాతం (మంగళవారం ఉదయం 10 నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు) 7.6 మి.మీ.లుగా నమోదైంది. బుధవారం జిల్లాలో ఎనిమిది మినహా మిగతా అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైంది. పినపాక మండలంలో 4.18 సెం.మీ., అశ్వాపురం మండలంలో 3.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మణుగూరు, కామేపల్లి, కొణిజర్ల, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, బోనకల్లు మండలాల్లో 3 సెం.మీ. వరకు వర్షం కురిసింది. పెనుబల్లి, అశ్వారావుపేట, ముల్కలపల్లి, గార్ల, టేకులపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన 23 మండలాల్లో 1 సెం.మీ. లోపు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ.లు. ఇప్పటికే 280.4 మి.మీ. వర్షపాతం (83.4 శాతం అధికం) నమోదైంది.
- సాధారణ స్థితికి జలాశయాలు
అధిక వర్షాలతో ఉగ్రరూపందాల్చిన జలాశయాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వాగులు, చెరువులు, కుంటల అలుగుల నుంచి నీటి ప్రవాహం తగ్గింది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి మందగించడంతో ఔట్‌ఫ్లో తగ్గింది.
- పంటల రక్షణ పనుల్లో రైతులు నిమగ్నం
వర్షాలు తగ్గడంతో, నీట మునిగిన పంటలను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. అధిక వర్షాలు, వరదలతో అనేకచోట్ల పత్తి చేనుల్లోకి, మిరప తోటల్లోకి; కొన్నిచోట్ల మొక్కజొన్న చేలల్లోకి వరద నీరు చేరింది. భూమిలో అధిక తేమ కారణంగా పైర్లు ఎర్రబారాయి. వేరుకుళ్లు, ఇతర తెగుళ్లు ఆశించాయి. నిల్వ నీటి తొలగింపు, తెగుళ్ల నివారణ, మందు పిచికారీ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పంటలకు పెద్దగా నష్టం జరగలేదని; అశ్వారావుపేట, కొత్తగూడెం మండలాల్లో మాత్రమే పంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పంటలు 50 శాతానికి పైగా దెబ్బతింటేనే పరిగణలోకి తీసుకుంటామని, ఈ రెండు మండలాల్లో కూడా 30 శాతం వరకు మాత్రమే పంటలు దెబ్బతిన్నాయని వారు అంచనా వేశారు.